Facebook Twitter
ఆకలి...నవ్వుతోంది....

అందమైన
గోరుముద్దలంటి 
అక్షరాలను
ఆవురావురుమంటూ
తింటున్నందుకు...
కవి కలం కడుపులోని
ఆకలి...కన్నీరు పెడుతోంది...

కొమ్మమీద పిట్టలు కొన్ని
పిడికెడు పొట్టల్ని నింపుకోలేక
తిప్పలు పడుతున్నందుకు...
ఆకలి...ఆలోచిస్తోంది...

ఎన్నో రకాల
రుచికర పదార్థాలు
కళ్ళముందే ఊరిస్తుంటే
"నాలుక మాట వింటే నరకమే"
అన్న డాక్టర్ మాటలు గుర్తొచ్చి
అన్నీ తినాలని ఆశపడే...
ఏమీ తినలేని కోటేశ్వరున్ని చూసి
ఆకలి...పకపక నవ్వుతోంది...

పచ్చని పంటలు పండించినా
రెక్కల్ ముక్కల్ చేసినా
అన్నపూర్ణ అవతారమెత్తి
అందరి ఆకలి తీర్చాలని ఎంతో
ఆశపడిన ఆరాటపడిన అన్నదాత
తన కడుపు నింపుకోవడానికి
అష్టకష్టాలు పడుతుంటే...వింతగా
ఆకలి‌...విరగబడి నవ్వుతోంది...

కన్నవాళ్ళెవరో తెలియక
కడుపు నింపుకునే దారేలేక
చెత్తకుండీల దగ్గర
కుక్కలతో కుస్తీ పడుతూ
ఆ కుక్కలు చించిన విస్తరాకుల్లో
ఎంగిలి మెతుకులు ఏరుకుతినే
అనాధలైన వీధిబాలల్ని చూసి
విలపిస్తోంది...ఆకలి

పగలురేయి
అష్టకష్టాలు పడినా
కడుకు నింపుకోలేక
కన్నీళ్ళతోనే కడుపు
నింపుకునే కష్టజీవిని చూసి
కన్నీరు కారుస్తోంది...ఆకలి

డిగ్రీలెన్ని ఆర్జించినా
అర్హతలెన్ని ఉన్నా
చిన్న ఉద్యోగం రాక
కడుపు నిండే దారిలేక...
శిక్ష పడుతుందని తెలిసినా
చీకట్లో ఓ ఇంట్లో దూరి
భారీ చోరీకి పాల్పడి
"నేరం నాది కాదు ఆకలిది"
అంటూ ఆవేశంతో
దిక్కులు పిక్కటిల్లేలా...
నినదించే నిరుద్యోగిని చూసి
నిట్టూరుస్తోంది...ఆకలి...