Facebook Twitter
గట్టున గవ్వలు…మునిగితె ముత్యాలు…

గట్టున తిరిగితేనె...
గవ్వలు దొరికేది
అంతులేని అగాధ
జలనిధిలో మునిగితేనె...
ఆణిముత్యాలు దొరికేది...

జీవితంలో కష్టాలొస్తేనే...
కన్నీటి విలువ తెలిసేది
దుఃఖం అనుభవిస్తేనే...
సుఖం విలువ తెలిసేది...

రైతు రేయింబవళ్ళు
రెక్కల్ ముక్కల్ చేస్తేనే...
పచ్చని పంటలు పండేది...
మన ఆకలిమంటలు ఆరేది...

రాయిని చెక్కితేనే...
సుందర దేవతా శిల్పం
మనకు దర్శనమిచ్చేది...
గర్భగుడిని చేరి అర్చనలు
అభిషేకాలు అందుకునేది...

పట్టుదలతో కఠోరమైన
శిక్షణ తీసుకుంటేనే...
ఏకాగ్రతతో సాధన చేస్తేనే...
ఆటలపోటీల్లో ప్రత్యర్థుల్ని మట్టి
కురిపించి స్వర్ణపతకాలను కొల్లగొట్టేది...

భగభగ మండే నిప్పుల్లో కాల్చితేనే...
బంగారు నగలు...నిగనిగ లాడేది...
కమ్ముకున్న కరిమబ్బులు కరిగితేనే... సూర్యుడు వెలుగులను విరజిమ్మేది...
ఆకాశంలో చిమ్మచీకటి కమ్ముకుంటేనే... చుక్కలు మిళమిళ తళతళ మెరిసేది...

ఏ తల్లిఐనా తొమ్మిది నెలలు ప్రసవ
వేదనపడితేనే...ఓబిడ్డకు జన్మనిచ్చేది...
ఆకలికి అలమటిస్తేనే...మనిషి రెక్కలు ముక్కలు చేసేది ధనాన్ని సంపాదించేది...
తరతరాలకు తరగని ఆస్తులు ఆర్జించేది...