అతిగా నీవు
ఆశ పడతావు
శ్రమ పడతావు
అన్నీ నీవేనని
భ్రమ పడతావు
రెక్కలు ముక్కలు చేసి
రక్తాన్ని స్వేదంగా మార్చి
ఖరీదైన స్థలాలు పొలాలు...కొంటావు..!
ఇష్టమైన పంటలు పండించి
పుష్టికరమైన ఆహారాన్ని....తింటావు..!
విలాసవంతమైన
విల్లాలు కష్టపడి నిర్మించి
కుటుంబ సభ్యులతో కలిసి
కుషీ కుషీగా కులాసాగా....ఉంటావు..!
కానీ ఒక్కప్రశ్న వేసుకోవు...
ఒక్క క్షణం ఆలోచించవు...
ఈ భోగభాగ్యాలు...
ఈ చిరునవ్వులు...
ఈ సిరిసంపదలు...
ఈ విందులు...
ఈ వినోదాలు...
ఈ విలాసాలు...
ఈ విహార యాత్రలు...
ఈ బంధాలు అనుబంధాలు...
ఎంత కాలం..? నిజానికి ఈ
నేలపైన నీవెంతకాలం...ఉంటావోనని..?
ఏదో ఒక రోజు
భళ్ళున తెలతెలవారగానే
నీ కళ్ళు రెండూ మూసేస్తావు
కాటికెళ్తావు చితిలో భగ్గు...మంటావు..!
బూడిదగా మిగిలిపోతావు
ఈ సత్యమెరిగి ఎందుకు...?
క్షణములో పేలిపోయే
నీటి బుడగలాంటి
కళ్ళు తెరిసీ తెరవంగానే
కరిగిపోయే కమ్మని కలలు...కంటావు..?
నరుడా ! ఓ నరుడా !!
వ్యర్థం చేయకు విలువైన కాలాన్ని...
తెలుసుకో నీ జీవిత పరమార్ధాన్ని...
ఉత్కృష్టమైన
నీ ఈ మానవ జన్మకు
కారకులైన నీ జననీ జనకుల్ని...
నీకు ప్రాణం పోసి ఈ భూమిపై
సంచరించే సద్భాగ్యం కలిగించిన
పరమాత్మున్ని నిత్యం ప్రార్థించు...
అత్యంత భక్తి శ్రద్ధలతో స్మరించు...
ఆపై ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రించు...
నీ ఉనికిని నీ సచ్చరితను...నీ సేవలను
చరిత్రలో చెరగని ముద్రలుగా ముద్రించు...



