Facebook Twitter
అన్నా ఓటరన్నా...జరా జాగ్రత్త !

నేతలు నేడు‌ ‌
వొంగివొంగి దండాలు పెడుతుంటే
పొయ్యిమీది పాలలా పొంగిపోకు
రేపు వారు కుర్చీలో
కూర్చోగానే కుబేరులౌతారు
కానీ ఆకలికి అలమటించే
అస్థిపంజరమయ్యేది నీవేనన్న
అందుకే ఓటరన్నా...జరా జాగ్రత్త !
నయవంచకులను నమ్మకు ! నీ ఓటును అమ్మకు!

వారెన్నో మాయమాటలు
కాకమ్మ కబుర్లు చెబుతారని...
అరచేతిలో స్వర్గం చూపిస్తారని...
వరాల వర్షం కురిపిస్తారని...
తియతియ్యని మాటలతో
మత్తుమందు చల్లుతారని...
చుట్టు తాళింపుల ఘుమఘులేనని...
ఓట్లచేపలకోసం వలలు విసురుతారని...
గాలాలువేస్తారని...
తెలుసుకో ఓటరన్న నిజం తెలుసుకో
నయవంచకులను నమ్మకు !నీ ఓటును అమ్మకు!

వారు ఊరిస్తారని 
ఉక్కిరిబిక్కిరి చేస్తారని
కులాల పేర మతాల పేర
మీ ఓట్లను చీలుస్తారని...
చాటుమాటుగా
మందుపాత్రలు పేలుస్తారని...
అందితే కాళ్ళు అందకపోతే
జుట్టు పట్టుకుంటారని...
తెలుసుకో ఓటరన్న నిజం తెలుసుకో
నయవంచకులను నమ్మకు ! నీ ఓటును అమ్మకు!