Facebook Twitter
నీఓటే...ప్రజాస్వామ్యానికి ప్రాణం

ఓ ఓటరన్నా‌ ! జరా జాగ్రత్త !
మన మహానేతలు
వాగ్దానాల వర్షం కురిపిస్తారు
అరచేతిలో స్వర్గం చూపిస్తారు
దొరికినంతా దోచుకుంటారు
స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారు

ఔను ధనబలంతో కులబలంతో
అహంకారంతో‌ విర్రవీగేవారికి
మాయమాటలు చెప్పి మోసంచేసేవారికి
ఆడినమాట తప్పేవారికి
ఐదేళ్ళకోసారి కనిపించే దారిమరచిన
ఈ గుడ్డివారికి నీఓటే...దారిచూపాలి
ఈ గుంటనక్కలకు నీఓటే... 
గట్టిగుణపాఠం నేర్పాలి
అహంకారంతో కళ్ళుపొరలు కమ్మిన
అధికార దాహంతో విర్రవీగే ఈ వెర్రివారికి
నీ ఓటుతో...బుద్దిచెప్పాలి శుద్ది చేయాలి

నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా
ప్రజాసేవకే అంకితమైన
ఘనులకుత్యాగధనులకు పెద్దపీట ‌వేయాలి
నీ ఓటుతో...పట్టాభిషేకం చేయాలి
నీ ఓటు...ప్రజాస్వామ్యానికి ప్రాణంపోయాలి
అది నవసమాజానికి నాంది కావాలి
నీ ఓటుతో...రామరాజ్య నిర్మాణం జరగాలి
ప్రజలంతా సుఖంగా సురక్షితంగా సుభిక్షంగా బ్రతకాలి