అందమైన తాజ్ మహల్
కులమతాలకు వ్యతిరేకంగా
ఆస్తిపాస్తులకు అతీతంగా
పూలతోటలో పుట్టినా
పూరిగుడిశ మీద ప్రేమ పుట్టిన
ఇద్దరు భగ్నప్రేమికులు
గడపదాటి గంగానదీతీరాన
ప్రేమ పక్షులై విహరిస్తున్నారని
తెలిసి అటు ఇటు అందరూ
కాకుల్లా అరిచినా
గద్దల్లా పొడిచినా
గర్భశత్రువులై గద్దించినా
గండ్రగొడ్డల్లెత్తి గాండ్రించినా
వేటకొడవళ్ళతో వేటగాళ్ళై
వేటాడినా వెంటాడినా
కసిగా కత్తులు దించినా
వెరవక ప్రేమను మరవక
నెత్తురు చిందినా చలించక
మూర్కులముందర పాపం
ఆ మూగ ప్రేమ ఫలించక
ఒకరిచేయిని ఒకరు విడువక
ప్రాణం కన్న ప్రేమే మిన్న అంటూ
ముళ్ళబాటలో పయణించిన
ఆశల ఆరాటంతో
ప్రేమ పోరాటం చేసిన
అట్టి భగ్నప్రేమికులకోసం
కలల శిలలతో
కన్నీటిధారలతో
కట్టిన సమాధి
ప్రేమికుల ఎదల్లో
పుట్టే ప్రేమకు పునాది
అదే అందమైన తాజ్ మహల్



