ఓ నేస్తమా ! చరిత్ర చెబుతున్న
ఓ నగ్నసత్యాన్ని వినిపిస్తున్న వినుమా !
నీవొక క్రీడాకారుడవైతే...
అంకిత భావంతో అకుంఠితదీక్షతో
కఠోర సాధనతో గెలుపే ఏకైక లక్ష్యంగా
బరిలోకి దిగి ప్రత్యర్థులను మట్టి కరిపించి
వీరుడులా...శూరుడిలా...విక్రమార్కుడిలా పోరాడి...పోరాడి...ఓడిపోతే
నీవు కార్చే "కన్నీటి చుక్కలే "
నీ కాళ్లకు మ్రొక్కుతాయి...
తమను క్షమించమని...
ఊటలా ఉప్పొంగి నేల రాలినందుకు...
ఒక్క "కన్నీటి సందేశాన్ని" అందిస్తాయి
రేపు బంగారు పతకాలు...
సన్మానాలు సత్కారాలు...
కీర్తి కిరీటాలు నీకే దక్కుతాయని...
అది "ఓటమే" కాదు రేపటి
నీ "ఘనవిజయానికి" ఒక రాచబాటని...
కానీ
నీ ప్రత్యర్థి కంటి
చూపులకే భయపడి
ఒక "పిరికిపందలా"
ఒక "ఉత్తర కుమారుడిలా"
నీవు పోటీ నుండి పారిపోతే
నీవు చేసిన సాధనలే...నీ శిక్షణలే
నీ చిరునవ్వులే నిన్ను "ఛీ"కొడతాయి
నీ పరువుప్రతిష్ట గంగలో కలుస్తుంది
ఏ పతకాలు నీవు సాధించలేవు
క్రీడాకారుడిగా నీవు కీర్తిని గడించలేవు
అపకీర్తి అవమానమే చివరికి నీకు దక్కేది
అందుకే ఓ నేస్తమా !
ఎన్ని అవాంతరాలు ఎదురైనా
కష్టాలను కన్నీళ్లను తట్టుకొని...
ఎదురీదేవాడే ఆవలి తీరం చేరేది...
ప్రాణాలకు తెగించి కూరుకుపోయే
మంచుతుఫాన్లను సైతం లెక్కచేయక
సాహసంతో ముందుకు సాగిపోయేవాడే
ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేది...



