అటు నిత్యం రామజపం చేసే
రామభక్తులందరూ ధన్యులే...
ఇటు శ్రీ రామకథను శ్రమించి లిఖించిన
కవిపండితులంతా అదృష్టవంతులే...
ఒక్క వాల్మీకి వారసులు తప్ప...
కారణం
ఎన్నో ఏళ్లు తపస్సు చేసి
రేయింబవళ్ళు ఎంతో శ్రమకోర్చి
24000 శ్లోకాలతో 7 కాండలుగా
వాల్మీకి మహర్షి సంస్కృతంలో ఎంతో
రసరమ్యంగా రచించిన రామాయణం
కలియుగంలో రెండు ముక్కలాయె...
విశ్వనాధ వారి చేతిలో
రామాయణ కల్పవృక్షంగా...
ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ
చేతిలో రామాయణ విషవృక్షంగా...
కానీ ఇంతటి విశిష్టమైనమహత్తరమైన
ఆదికావ్యాన్ని ప్రపంచానికి అందించిన
వాల్మీకిజాతిని మాత్రం ప్రభుత్వ పాలకులు
తమ ఓటు బ్యాంకు కోసం...
తమిళనాడులో బీసీలుగా...
ఆంధ్ర తెలంగాణల్లో ఎస్టీలుగా...
భారతమంతా ఎస్సీలుగా...విభజించి
దక్కవలసిన రాజ్యాంగ హక్కుల్ని
మూడు ముక్కలు చేశారు...
ఐనా ఓ వాల్మీకి వారసులారా...!
మీరు ధన్యులే సుమా...కారణం
ఆ సూర్య చంద్రులు చుక్కలున్నంతకాలం
ఈ రామాయణ కావ్యం ఓ సజీవనదియే..
ఆ రామాయణాన్ని
గుళ్ళు గోపురాల్లో రామభక్తులు
పారాయణం చేసినంతకాలం ఈ
లోకానికి శ్రీరామచంద్రుడే ప్రత్యక్ష దైవం
ఆ కోదండరామయ్యను ప్రపంచమంతా
ప్రత్యక్ష దైవంగా పూజించినంతకాలం
రామాయణం వ్రాసిన వాల్మీకి మహర్షి చిరంజీవియే...సదా చిరస్మరణీయుడే...
అందుకే ఓ వాల్మీకి వారసులారా...!
మీరంతా ధన్యులే...కానీ మీరు ప్రశ్నించాలి
హక్కులకోసం...సమిష్టిగా ప్రతిఘటించాలి
మీకు దక్కవలసిన
రాజ్యాంగ రక్షణలు మీకు దక్కేలా...
ఆ శ్రీరామచంద్రుడే ప్రభుత్వ
పాలకులకు కనువిప్పు కలిగించునుగాక...



