ప్రోత్సాహించేవారు కరువై...
వెన్నుతట్టేవారు దూరమై...
బ్రతుకు భారమై...
అంధకారమై...
అగమ్యగోచరమై...
ఆశలు ఆశయాలు ఆవిరై...
కన్న కలలన్నీ కన్నీటి ధారలై...
తీరందాటని అలలై...
కనుమరుగైపోతున్న కవులను...
ఆదరించేవారు లేక కాలగర్భంలో
కలిసిపోతున్న కవిత్వాన్ని...
పాతాళంలోకి జారిపోతున్న
పాశుపతాస్త్రమంటి కలాలను...
మోడువారిపోతున్న
సాహితీ వృక్షాలను...
నీరు పోసి పెంచే
కరుణామయులకు...
దయార్ద్రహృదయులకు...
తెరమరుగై పోతున్న
తెలుగు భాష వెలుగును
పదిమందికి పంచే...
కళాపిపాసులకు పోషకులకు...
తమ శక్తియుక్తులను ధారబోసి
విలువైన సమయాన్ని వెచ్చించి
వెలకట్టలేని ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
కుటుంబాన్ని ప్రక్కకు నెట్టి
రేయింబవళ్ళు కళాసేవకే అంకితమై
ఎంతో శ్రమకోర్చి ఓపికతో సహనంతో
భారీగా నిరంతరం సాహితీ సభలు
సమావేశాలు ఏర్పాటు చేసి...
ఔత్సాహిక కవులను ఆహ్వానించి...
వేదికలపై కవితగానం చేసే
బంగారు అవకాశాలను కల్పించి
ముఖ్య గౌరవ విశిష్ట ప్రత్యేక అతిథుల
విలువైన విజ్ఞానదాయకమైన
సంక్షిప్త క్లుప్త సౌందర్య సందేశాలతో
సాహితీమూర్తుల అమృతహస్తాలతో
సహనంతో చప్పట్లు కొడుతూ
సన్మాలకోసం ఆశతో
నిరీక్షించే కవులందరికీ
విలువైన శాలువాలు కప్పి
మెరిసే మొమోంటోలిచ్చి
అందమైన ప్రశంసా పత్రాలందజేసి
అక్కున చేర్చుకుని ఆశీర్వదించి
కవులుగా గొప్ప గుర్తింపు నిచ్చి
సగౌరవంగా సత్కరించి...
ఫోటోలకు ఫోజులిచ్చి...
జీవితంలో...
మరిచి పోలేని ...
మధుర జ్ఞాపకాలతో...
చెరగని చిరునవ్వులతో...
తరగని తృప్తిని సంతృప్తిని
గుండెలనిండా నింపే...
సగర్వంగా ఇంటికి పంపే...
ఎందరో మహానుభావులు...
అందరికీ వందనాలు...
ఎందరో
కళాపోషకులు...
సహృదయులు...
సాహితీమూర్తులు...
నిరాడంబర జీవులు...
నిస్వార్థ పరులు...
అందరికీ అభివందనాలు...
ఎందరో
అభినవ కృష్ణదేవరాయలు...
ఘనులు మునులు త్యాగధనులు...
వారందరికీ పాదాభివందనాలు...
నా అక్షర లక్షల కుసుమాంజలులు...



