అరచేతిని అడ్డుపెట్టి
సూర్యకాంతిని ఆపాలనుకుంటారు
కొందరు అమాయకులు అజ్ఞానులు
అఖండమైన కార్మిక శక్తిని
అణచాలనుకుంటారు
కొందరు అధికారులు అహంకారులు
అది అసాధ్యం...అసాధ్యం...అసాధ్యం
సంస్థకు ప్రాణమైన సిబ్బందిని ఇబ్బంది పెట్టి
వారి కడుపులు కొట్టి వారి శ్రమను దోపిడి చేసి
కార్మికుల హక్కులను కర్కశంగా కాలరాసిన
కార్పోరేట్ సంస్థలెన్నీ కాలగర్భంలో కలిసిపోయే
కష్టజీవులను తమ కన్నబిడ్డలుగా భావించి
కంటికిరెప్పలా చూసుకున్నవే చరిత్రలో నిలిచిపోయే
ప్రగతి రథచక్రాలు కదలాలన్నా
జగతిలో జనులు సుఖంగా జీవించాలన్నా
శ్రామికులు కార్మికులు కర్షకులు
తమ రక్తాన్ని స్వేదంగా చిందించక తప్పదు
ఔను...
ఎండే కడుపులతో
మండే గుండెలతో
మండుటెండల్లో కొండలమీద
కండలు కరిగేలా బండలుమోసే
బద్దలుచేసే ఓ కార్మికులారా !
కార్ఖానాల్లో యంత్రాలనడుమ
రాత్రింబవళ్ళు శ్రమించే ఓ శ్రామికులారా !
బంజరుభూముల్లో బంగారం పండించే
ఓ కర్శకులారా ఓ రైతుకూలీల్లారా!
ఓ పీడిత తాడిత బడుగు
బలహీన బహుజనులారా!
మీ యజమానులను మీ బాసులను
మీ దేవుళ్ళుగా దేవతలుగా పూజించండి!
గౌరవించండి ! సంస్థ పురోభివృద్ధికి
శక్తి వంచనలేకుండా కృషి చేయండి !
కానీ బానిసత్వాన్ని మాత్రం సహించకండి!
మీ హక్కులను కాలరాస్తే? పులులై పోరాడండి!
పోరాడితే పోయేది ఏముంది? చెప్పండి !
సంఘంలో మీకు సమానత్వం రావడం తప్ప!
ఓ కార్పొరేట్ సంస్థ యజమానులారా !
ఓ బడా పారిశ్రామిక వ్యాపార వేత్తలారా!
మీ సంస్థల్లో శ్రామికులతో కార్మికులతో
మీరు బండచాకిరి చేయించుకున్నప్పుడు
వారు వారి కడుపులోని ఆకలినిఅణచుకొని
తమ రక్తాన్ని స్వేదంగా మార్చినప్పుడు
వారు వారి ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి
సంస్థ అభివృద్ధికి కృషి చేసినప్పుడు
వారి "చెమటచుక్కలు"ఆరిపోకమునుపే
వారి "కష్టార్జితాన్ని" వారికి చెల్లించాలన్న
ఆ "అల్లా సందేశాన్ని" కలనైనా మరువకండి...
"కార్మికుల హక్కులను" కాలరాయకండి........



