Facebook Twitter
కాడెద్దులు నా కన్నబిడ్డలు

ఈ రైతన్న...

కఠినాత్ముడా...

కరుణామయుడా...

ఆ ఎద్దులకు అర్థం 

కావట్లేదు ఎందుకంటే....

 

ఎర్రని ఎండలో ఎద్దులతో రైతన్న 

మాగాణి దున్ని నారు పోస్తాడు 

ఆకలైతే పాపం ఆ ఎద్దులకింత

గడ్డిపెడతాడే కాని.... 

ఎద్దుల్ని పచ్చని నారును మాత్రం 

మేయనివ్వడు....

 

ఎర్రని ఎండలో ఎద్దులతో రైతన్న

అదను చూసి దుక్కిదున్ని 

సేద్యం‌ చేస్తాడు విత్తనాలు చల్లి 

పచ్చని పంటలు పండిస్తాడు 

ఆకలైతే పాపం ఆ ఎద్దులకింత

ఏ ఎండుగడ్డో ఏ పచ్చగడ్డో

వేస్తాడే కాని కుడితి పోస్తాడేకాని

ఎద్దుల్ని పంట పొలంలో మాత్రం

మేయనివ్వడు......

 

ఎద్దులంటే 

ప్రేమలేకనా కాదు, 

ముందుపంట పండితేనేగా 

తనకు తిండి దొరికేది...

తిండి దొరికితేనేగా 

తన కడుపు నిండేది

కడుపు నిండితేనేగా 

తాను బ్రతికిబట్ట కట్టేది

తాను బాగా బ్రతుకితేనేగా 

తన ఎద్దులకింత తిండి పెట్టేది... 

అంతే తప్ప మూగజీవులంటే ప్రేమ

జాలి కరుణా దయ లేకకాదు

ఏతండ్రి తన కన్నబిడ్డల

కడుపులు మాడ్చడు, ఔను

కాడెద్దులు తనకు కన్నబిడ్డల కన్నమిన్న...