Facebook Twitter
అన్నా అన్నా ! ఓ రైతన్నా !!

అన్నా ఓ రైతన్నా! అలా నింగిలోకి తొంగితొంగి చూడకు!

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశతో ఎదురు చూడకు!

 

అన్నా ! ఓ రైతన్నా ! కార్చడానికి కళ్ళలో కన్నీరేలేదని

నిప్పులై దహించే బ్యాంకుల అప్పుల్ని ఆర్పే దారేలేదని

నోటికాడిముద్దలా చేతికందిన పంట దక్కేమార్గమేలేదని

తాకట్టుపెట్టిన ఆలితాలిబొట్టు విడిపించుకొనే ఆశేలేదని

ఇక ఆత్మహత్యే శరణ్యమని ఆవేశపడకురా ఓ రైతన్నా!

పురుగులమందు కోసం పరుగులు పెట్టకురా ఓ రైతన్నా! 

 

నెర్రెలిచ్చిన నేలను,కరువు రక్కసి కరాళనృత్యాన్ని

కలలో కలత నిదురలో సైతం కలవరించకురా రైతన్నా!

పరువు పరువని పగలురేయి పలవరించకురా రైతన్నా!

కరువు వస్తే రానియ్ గుండె చెరువైతే కానియ్, కానీ

నీ ఆత్మవిశ్వాసం మాత్రం సడలనియ్యకురా ఓ రైతన్నా!

నిరాశకు నిర్వేదానికి క్షణికావేశానికి గురికాకురా ఓరైతన్నా!

 

ఆ ప్రకృతి నీపై నీ పచ్చని పంటలపై పగపట్టిందని

వెక్కివెక్కి ఏడవుకురా దుక్కిదున్నే ఓ బక్కరైతన్నా 

నిరాశతో కుమిలిపోక కృంగిపోక ఆశే ఆయుధమని

అంధులైన అధికారుల్ని నయవంచకులైన నాయకుల్ని 

నమ్మితే బ్రతుకు నరకమని స్వశక్తేయే నీకు స్వర్గమని

ఆవగింజంత ఆశతో కొండల్ని సైతం పిండి చేయవచ్చని

ఆత్మస్థైర్యమే సుఖజీవనసూత్రమని చీకటిలోచిరుదివ్వెని 

తెలుసుకోరా రైతన్నా! తెలివిగా బ్రతకరా ఓ రైతన్నా!

 

ఎందుకు దిగులెందుకు ? ఎవరో వస్తారని ఎదురు

చూడడమెందుకు ? ఆశే శ్వాసగా సాగిపో ముందుకు...