Facebook Twitter
కవికీర్తి ఆచంద్రతారార్కం…

మొన్న రవి గాంచనిచో
కవిగాంచునన్నారు
వెలుగులు విరజిమ్మే రవికన్న
సాహితీ వెలుగులు విరజిమ్మే
కవియేమిన్న అన్నారు

నిన్న కత్తి కన్నా కలం మిన్న అన్నారు
రాజ్యాలను ఏలే రాజుల కన్నా 
కవిశేఖరుడే మిన్న అన్నారు

కానీ నేడు నేనంటున్నాను
కవికి జనమే కానీ మరణం లేదని
కారణం ఒక్కటే
కవి వ్రాసిన అక్షరాలు శాశ్వతం
కవి రాసిన కావ్యాలు శాశ్వతం
కవితన కలాన్నిఉలిగా మార్చి సామాజికశిలపై
చెక్కిన సాహిత్య సంస్కరణలు శాశ్వతం
వాటికి జీవమే కానీ మరణమే వుండదాయె
మరి వాటిని కన్న ఆ కవికెక్కడిది మరణం?
అందుకే కవులకీర్తి ఆచంద్రతారార్కమన్నారు

మన ఆనందరావుగారు
అకస్మాత్తుగా ఎక్కడికో
వెళ్ళారని అనుకుంటున్నాం
కాని వారు ఇక్కడే ఇక్కడే
మన ప్రక్కనే ఉన్నారు
మన మధ్యనే వున్నారు
మన తలపుల్లో మన భావాల్లో
బ్రతికే వున్నారు వుంటారు కూడా

ఆనందరావు గారు మంచికవిగా
గురుదక్షిణ అమూల్య కానుకల
నవలాకారుడిగా
అనేక సాహితీ సాంస్కృతిక
సంస్థలలో క్రియాశీలక వ్యక్తిగా
వందకు పైగా చక్కని
కథలు వ్రాసిన ప్రముఖ కథారచయితగా
ఎన్నో ప్రశంసలందుకున్నారు
ఎన్నో సన్మానాలు సత్కారాలు పొందారు

ఐతే విధి విషసర్పమై వేసింది కాటు
మంచిమనీషీ మన ఆనందరావు గారి
అకాలమరణం
ఈ సాహితీలోకానికి ఒక తీరని లోటు

నిగర్వి నిత్యం నవ్వులు రువ్వే
నిర్మలమూర్తి
ఆత్మీయతకు ప్రేమకు
ప్రతిరూపమైన
స్నేహానికి సహృదయతకు
మంచితనానికి మానవత్వానికి
కలుపుగోలుతనానికి,
నీతికి నిజాయితీకి
నిలువెత్తు నిదర్శనమైన
మన ఆనందరావుగారి
ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...
వారి కుటుంబ సభ్యులకు
నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

నేను నా కవిత్వం కవితలు
ఆ తూర్పుకు మీ పేరు పెట్టాలి...


ఓ కవిశ్రేష్టులారా !
కదిలించే కనువిప్పు కలిగించే
గుండెలను పిండే మీ కవిత్వం
మండే కడుపులో నుండి
ఆర్పని కనురెప్పల నుండి
నీటిచుక్కై...నిప్పురవ్వై...పుట్టాలి
ప్రతిమనిషి గుండెతలుపుల్ని...తట్టాలి
సమాజ పరివర్తనకు...
సామాజిక శ్రేయస్సుకు...
సమస్త కష్టజీవుల కన్నీటిబ్రతుకుల్లో
పెనుమార్పుకోసం శ్రీకారం...చుట్టాలి...

జయహో జయహో అంటూ జేగంట...కొట్టాలి...

మార్పునుకోరే
మీరు తూర్పువైపే పయనించాలి 
ఆ తూర్పుకు మీ పేరే...పెట్టాలి...

ఓ కవిశ్రేష్టులారా !
చచ్చి నిన్న శవమైన
మీ కవిత్వం కాళిలా నేడు
కళ్ళు తెరిచింది కత్తి దూసింది
పులిలా దూసుకు పొమ్మంది
నేడు మీ కవిత్వం...విత్తనమై
మళ్ళీ మట్టిలో నుండి పుట్టింది
మర్రివృక్షంలా మారిపోయింది
ఎందరికో చల్లని నీడనిచ్చింది

గాఢాంధకారంలో గబ్బిలాలవలె
గోడలకు వ్రేలాడుతూ మొద్దుల్లా
గానుగెద్దుల్లా గాఢనిద్రలో వున్న
పిరికిపందల్ని కొరడాలతో కొట్టింది

భుజంతట్టి వెన్నుతట్టి పరుగుపెట్టమంది

అగ్నిగోళాలవలె భగ్గున మండిపొమ్మంది
కవితా శిల్పసుందరిని ఉన్మాదపుఉలితో

చెక్కి ఊహల ఊయలలో ఊరేగే
ఓ అమరశిల్పి జక్కన్నలారా...
మరో ఆధునిక భారతాన్ని వ్రాసే
ఓఅభినవ నన్నయ్య తిక్కన్నలారా...

నేడు నివురు కప్పినదేదైనా
రేపు ఒక..‌.విస్ఫోటనమేనని...
అది బ్రద్దలయ్యే అగ్నిపర్వతం నుండి

ఎగిసిపడే... ఎర్రని లావేనని...
తెలుసుకోండి నిజమొక చేదుగుళికేనని...

ఓ కవిశ్రేష్టులారా !
మీ భావాలు గుండెల్లో గుచ్చుకోవాలి
మీ కవిత్వం చెంప చెళ్ళుమనిపించాలి
మీ కలాలు మరఫిరంగులై పేలాలి
ఈ శిధిల ప్రపంచాన్ని పునర్మించాలి
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు...సమానత్వం

సౌభ్రాతృత్వపు పునాదుల మీద
మీరు నవసమాజాన్ని స్థాపించాలి...
కొత్త బంగారులోకాన్ని సృష్టించాలి...