ఓ రైతన్నా !
పొలంలో పంట పండలేదని
నష్టమొచ్చి అప్పులపాలయ్యానని
హలమును పక్కన పెట్టక
బలరాముడివై హలాయుధుడువై
నిలబడరా ఓ రైతన్నా!
హలం నీది పొలము నీది, పండించే పంట నీది
నీవు వీరహనుమంతుడివిరా రైతన్నా!
ఎండనకా, వాననకా, రేయనకా, పగలనకా
రక్తాన్ని చెమటగా మార్చే ఓ రైతన్నా!
నీవు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎక్కడ?
అంధులైన అధికారులకు
నీ హక్కులను కాలరాసే హక్కు ఎక్కడిది ?
పట్టించూకోని ప్రభుత్వాన్ని ప్రశ్నించు ప్రతిఘటించు
నీకే ఆగ్రహమొస్తే ఈ ప్రపంచం దద్దరిల్లిపోదా
నీవే తిరగబడితే ఈ నేతల తలరాతలే మారిపోవా
ఓ రైతన్నా !
వద్దు ఆత్మహత్యలకు పాల్పడవద్దు
చచ్చి సాధించేది ఏమిలేదు
నీ కుటుంబం కుమిలిపోవడం కూలిపోవడం తప్ప
నీ చేతిలోని హలమే నీకుబలం
ఓ రైతన్నా!
నీ హలానికున్న శక్తి మరి దేనికున్నది ఈఅవనిపైన
నీ చేతిలో హలం పొలం దున్నడానికే కాదు
నిన్ను అడుగడుగునా మోసం చేసే
దగుల్బాజీ దళారీల గుండెల్లో గునపంలా గుచ్చడానికి
ఓ రైతన్నా !
నీ పోరాటం న్యాయమైది ఏనాటికైనా గెలుపు నీదే
నీవు బలహీనుడవు కాదు నీవు బాహుబలివి



