తనకు తిండి పెట్టింది ఎందుకు?
ఆకలేసిన ఒక మేక
కసాయివాడి ఎడమ చేతిలోని
పచ్చని ఆకుల్నిచూసి
పక్కున నవ్వుతుంది
వాడి వెంటే ఆశతో పరుగులు తీస్తుంది
వాడి కాళ్ళచుట్టే గిరగిరా తిరుగుతుంది
వాడు ప్రేమతో కొన్ని
ఆకులు ముందు విసరగానే
పాపం,ఆకలితో వున్న ఆ మేక
చకచకా ఆకులు మేస్తుందే కాని
వాడి కుడిచేతిలో
పదునైన ఒక కత్తి వుందని
ఇక తనకిదే చివరిరాత్రని
నిద్రలేచీ లేవంగానే
కళ్లుతెరిచీ తెరవంగానే
మెడమీద కత్తి పడుతుందని
రక్తపు మడుగులో పడి
తాను గిలగిలలాడక తప్పదని
ఆపై తన ప్రాణాలు క్షణాల్లో
గాలిలో కలిసిపోతాయని,పాపం
ఆ అమాయకపు మేకకు తెలియదు
తెలిసీ కూడా ప్రయోజనం లేదు
ఆ కసాయివాడు పచ్చిమోసగాడని
తనకు తిండి పెట్టింది తనను తినడానికేనని



