ధరణిలో నడిచే దైవాలు
రక్తాన్ని
స్వేదంగా మార్చి
రెక్కలను
ముక్కలుచేసుకుని
దుక్కిదున్ని
బంజరునేలలో
బంగారు పంటలను
పండించి
అందరి ఆకలితీర్చే
అన్నదాతలే గదా
ధరణిలో నడిచే దైవాలు
కానీ,ఆ అన్నదాతలే...కదా
చేసిన అప్పులు తీర్చలేక
తాకట్టుపెట్టిన
పుస్తెలు తేలేక
పురుగుమందులు
పుచ్చుకునేది
ఆ అన్నదాతలే...కదా
ఆకలికి అలమటించేది
అస్థిపంజరాలైపోయేది
ఆ అన్నదాతలే...కదా
ఆత్మగౌరవం
అహం దెబ్బతిని నేడు
ఆత్మహత్యలకు పాల్పడేది
ఆ అన్నదాతలే...కదా
నిన్న నాగలిని మట్టిని నమ్ముకన్నది
నేడు పైరుపాటమాని పోరుబాట పట్టింది
కర్షకుల కడుపులు మాడ్చే కార్పొరేట్ల కొమ్ముకాసే
రాక్షస చట్టాల రద్ధుకోసం రాత్రింబవళ్ళు రైతులు
చేసే ఉద్యమానికి మద్దతినిద్దాం మానవతనుచాటుదాం...



