Facebook Twitter
తెలుసుకోరా రైతన్నా!  తెలివిగా బ్రతకరా ఓ రైతన్నా!!

చూడకు చూడకు రైతన్నా

ఎదురు చూడకురా రైతన్నా

కదలని కసాయి గుండెల 

కారుమబ్బులు కరిగేదెప్పుడని 

ఆ వరుణదేవుడు 

కరుణించే దెప్పుడని

నెర్రెలిచ్చిన నేలపై 

తొలకరిజల్లులు కురిసేదెప్పుడని

దిగులు సెగలు రగిలి పగిలిన

నీ ఎడారిగుండెలో ఆశల 

విత్తనాలు మొలకెత్తేదెప్పుడని

చూడకు చూడకు రైతన్నా

ఎదురు చూడకురా రైతన్నా

ఎవరో వస్తారని ఏదో చేస్తారని 

ఎదురు చూసి మోసపోకురా రైతన్నా 

 

కన్నీటి కరెంట్ షాక్ కు గురికాకురా ఓ రైతన్నా

బంగారు బ్రతుకును బలిచేసుకోకురా ఓ రైతన్నా

ఆత్మహత్యన్న ఆలోచనే రానీయకురా ఓ రైతన్నా

రెప్పపాటులో కుప్పకూలిపోకురా ఓ రైతన్నా 

నీ వారందరి జీవితాలు అంధకారమౌతాయని

తెలుసుకోరా రైతన్నా తెలివిగా బ్రతకరా రైతన్న

 

మొన్న మిడతల దండొచ్చిందని

నిన్న కాయతొలుచు పురుగొచ్చిందని

నేడు అనావృష్టితో కరువొచ్చిందని

ప్రకృతి పగపట్టిందని పచ్చని పంటలను

ధ్వంసం చేసిందని  కుమిలిపోకురా రైతన్నా 

నిరాశతో కృంగిపోకురా రైతన్నా 

ఆశే నీ ఆయుధమని

ఆవగింజంత ఆశతో కొండల్ని పిండిచేయవచ్చని

చిగురంత నమ్మకమే సుఖజీవన సూత్రమని 

తెలుసుకోరా రైతన్నా తెలివిగా బ్రతకరా రైతన్నా