ఏమిటో ఆ మూడేమిటో ?
అవి రైతన్నల కుత్తుకలకు ఉరితాళ్లో
మెడపై వ్రేలాడే గండ్రగొడ్డల్లో
పదును పెట్టిన కత్తులో కటారులో
బాకులో మరతుపాకులో
ఎక్కుపెట్టిన రాక్షసబాణాలో ఎవరికెరుక?
అవి మూడు నల్లనిచట్టాలంట
ఎవరికో చుట్టాలంట ఎవరికీ అర్థం కావంట
ఏమిటో ఆ మూడేమిటో?
పెన్నుపోటుతో వేటువేయడానికి
వెన్నుపోటు పొడవడానికి
చాటుమాటుగా కాటువేయడానికి
సిద్దంగా ఉన్న కాలనాగులో
పూలదండలు చేతబట్టుకుని
ముసిముసి నవ్వులు నవ్వుతూ
కూర్చున్న మేకవన్యపులులో ఎవరికెరుక?
అవి మూడు నల్లనిచట్టాలంట
ఎవరికో చుట్టాలంట ఎవరికీ అర్థం కావంట
ఏమిటో ఆ మూడేమిటో?
అవి అమృత భాండాలంట
కాదు కాదు అవి ఆరక రగలే అగ్నిగుండాలో
సుడులు తిరిగే సుడిగుండాలోఎవరికెరుక?
అవి మూడు నల్లనిచట్టాలంట
ఎవరికో చుట్టాలంట ఎవరికీ అర్థం కావంట
ఏమిటో ఆ మూడేమిటో?
అవి బ్రద్దలవడానికి సలసల కాగే లావాను
విరజిమ్మడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాలో
ఉరుములు మెరుపులు లేకుండా
అకస్మాత్తుగా నెత్తిన పడే పిడుగులో ఎవరికెరుక?
అవి మూడు నల్లనిచట్టాలంట
ఎవరికో చుట్టాలంట ఎవరికీ అర్థం కావంట
ఏమిటో ఆ మూడేమిటో?
అల్పపీడనాలో వాయుగుండాలో
వరదలో పెనుతుఫానులో
సుడిగాలులో సునామీలోఎవరికెరుక?
అవి మూడు నల్లనిచట్టాలంట
ఎవరికో చుట్టాలంట ఎవరికీ అర్థం కావంట
వాటి పరమార్థం ఆ పరమాత్మకే ఎరుకంట
అర్థంకాని ఆ వ్యర్థమైన చట్టాలెందుకంట?
ఎవరికోసమంట? ప్రభుత్వాలు అధికారులు
ఆలోచించాలంట రైతన్నలను రక్షించాలంట



