ఇది మాబంగారమని మట్టినిముట్టి పిడికిటపట్టి
తల్లిలాంటి నేలను ముద్దాడి మురిసేదెవ్వరు ?
నిన్న ఏపుగా పండి నేడు పురుగులతో నిండి
ఎండిపోయిన పైరును గుండెలకద్దుకొనేదెవరు?
రేయింబవళ్లు రెక్కలుముక్కల్ చేసి
రక్తాన్ని స్వేదంగా చిందించి సేద్యం చేసి
అన్నదాతలై అందరి కడుపులను నింపి
ఆస్తులెన్నున్నా ఆకలికి అలమటించేదెవరు?
కుడిఎడమల దగాలకు మార్కెట్ యార్డుల
మధ్యవర్తుల మాయాజాలానికి బలైపోయేదెవరు?
గిట్టుబాటు ధరలేక గిలగిలకొట్టుకునేదెవరు?
తమ కళ్ళెదుటే జరిగే పచ్చి మోసాలను
అన్యాయాలను అక్రమాలను ఎదిరించలేక
మానవత్వంలేని మనుషుల మధ్య జీవించలేక
బ్యాంకులఅప్పులు తీర్చలేక తాకట్టు పెట్టిన
తాలిబొట్టును తెచ్చి ఆలిమెళ్ళో వేయలేక
తమ మెడలకు ఉరితాళ్ళు బిగించుకునేదెవరు?
కన్నబిడ్డల కాలేజీ ఫీజులు కట్టలేక
మాయదారి రోగమొచ్చి మంచానపడి మూలిగే
అమ్మానాన్నలకు మందులు కొనిపెట్టలేక
కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించలేక
ఏ చెట్టుకొమ్మకో తమ ఊపిరిని
ఊయలగా చేసి ఊగాలనుకునేదెవరు ?
అన్నదాత అన్నదాతంటూ వెన్నుపోటు పొడుస్తూ
రైతన్నలే రాజులంటూ ఆ "రాజుల రక్తాన్నే"
జలగల్లా పీలుస్తూ రాబందుల్లా త్రాగుతూ
కడుపులు నింపే కర్షకుల నోట్లోనే మట్టిగొట్టే
కాయతొలిచే, రసం పీల్చే "పురుగుల్లాంటి" ఈ
మాయదారి మనుషులమధ్య బ్రతకలేమనేదెవరు?
కన్నబిడ్డలకు కట్టుకున్నభార్యలకు
అమ్మానాన్నలకు అప్పులవాళ్ళకు
తమ ముఖాలను చూపించలేక
చీకటిలో కూర్చొని కుమిలికుమిలి ఏడ్చేదెవరు?
"క్షమించమని" వేడుకునేదెవరు?
చివరికి ఆ కారుచీకటిలోనే కలిసిపోయేదెవరు?
కానీ పాపం ఆ రైతన్నలు కలనైనా ఊహించనిదొక్కటే
నిన్నతాము కొన్న "పురుగుమందే" తమకు విందౌతుందని
"చిమ్మచీకటే"తమకు చితిని పేరుస్తుందని
"కరుణలేని కాలమే"తమకన్నీటికి పరిష్కారమౌతుందని
"జాలిలేని ఆ దైవమే"తమజాతకాల్ని మారుస్తారనేదెవరు?
మనదేశానికి వెన్నెముకలైన అమాయకపు రైతన్నలే కదా
ఆత్మహత్యే అన్ని సమస్యలకూ పరిష్కారమని
పొరపడిన ఆ అన్నదాతల అకాల మరణవార్త విన్న
ఆ కుటుంబాల ఆర్తిని అంతులేని ఆ క్షోభను తీర్చేదెవరు ?
రైతన్నల ఆత్మహత్యలను ఆపేదెవరు వారినాదుకునేదెవరు?
ఓ రైతన్నలారా ! మీరే మీరే...మీరు చేసే ఉద్యమాలే
ఇకనైనా నిజం తెలుసుకోండి మీ హక్కులకై పోరాడండి...
పాషాణ హృదయులైన పాలకులను ప్రశ్నించండి...
పిడికిళ్లు బిగించి... పిడుగులై ప్రతిఘటించండి...
కదిలిరండి... కలిసిరండి... కత్తులై కదం తొక్కండి..
నాడే కన్నుమూసిన ఈ అన్నదాతల ఆత్మలకు శాంతి...
నాడే బ్రతికి బట్టకట్టిన వారి జీవితాల్లో నూతన కాంతి...



