దుక్కిదున్నే రైతన్న దుఖిస్తే?...
నిన్న
రైతే రాజన్నారు
రైతు రాజ్యమన్నారు
రైతే దేశానికి అన్నదాతన్నారు
రైతే దేశానికి వెన్నెముకన్నారు
నిన్న
ఎర్రని ఎండల్లో
ఎండినడొక్కలతో
ఎద్దులకింత గడ్డి పెట్టి
తానిన్ని గంజినీళ్ళుత్రాగి
బురదలో దిగి మాగాణి సాగు
చేసిన మట్టిమనిషే మన రైతన్న
కానీ నేడొచ్చే మూడుచట్టాలతో
దుక్కిదున్నుతూ దుఖించే
బక్కరైతన్నకు పచ్చడి మెతుకులే దిక్కు
కార్పోరేట్ సంస్థలకు మాత్రం
పంచభక్ష్య పరమాన్నాలు దక్కు
ఇది ఖచ్చితంగా
మూటికి ముమ్మాటికీ
కంచే చేను మేయడమే
కాకులను కొట్టి
గద్దలకు వేయడమే
తల్లిపాలు త్రాగి
రొమ్మును గుద్దడమే
అన్నం పెట్టిన
చేతికి సంకెళ్లు వేయడమే
తిన్న ఇంటివాసాలు
లెక్కపెట్టడమే
నమ్మిన వారినే
నట్టేట ముంచడమే
కడుపులో కత్తులుంచుకొని
కౌగలించుకోవడమే
బ్రతకండని ప్రార్థిస్తూ
చనిపోయేందుకు మందులవ్వడమే
ప్రార్థించే పెదవులకన్న సహాయంచేసే
చేతులేమిన్నన్న నగ్నసత్యాన్ని మరచిపోవడమే



