Facebook Twitter
అన్నదాతల ఆక్రందనలు...

అన్నాలారా!  ఓ రైతన్నలారా !

ఎవరి కోసం ఆ ఎదురుచూపులు?

ఎవరో వస్తారని ఏదో చేస్తారని 

ఎంత కాలం ఈ నిరీక్షణ ?

ఎంతకాలం ఈ నిరాశా నిట్టూర్పులు?

ఎంతకాలం ఈ మొద్దునిద్ర ? వద్దు వద్దు

ఇకనైనా నిద్ర మేల్కొండి ! నిజం తెలుసుకోండి!

 

ఓ రైతన్నల్లారా! 

మీకు కొడవలిపట్టి కొయ్యడం తెలుసు 

కలుపుమొక్కల్ని వేరెయ్యడం తెలుసు 

ఓ ప్రత్తి రైతుల్లారా! ప్రతిఘటించండి !

ఓ పొగాకు రైతుల్లారా ! పోరుకు సిద్ధంకండి!

కత్తులై కదం తొక్కండి!

ఓ చెరుకు రైతుల్లారా ! పిడికిలి బిగించండి

పిడుగులు కురిపించండి !

ఓ గోధుమ రైతుల్లారా ! గొడ్డళ్లు నూరండి!

నిరసనలు తెలియజేయండి ! నిప్పులు కురిపించండి!

 

అన్నదాతలకే అన్యాయం జరిగితే 

అన్నదాతలనే వెన్నుపోటు పొడిస్తే 

అన్నదాతల గుండెల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలైతే 

అన్నదాతల కళ్ళు కన్నీటి సముద్రాలైతే

అన్నదాత నెత్తిన పిడుగులు పడితే

అన్నదాతల వెన్ను విరిగితే అందరి నోట్లోమట్టేనని

అన్నదాతలే కన్నుమూస్తే దేశమంతటా 

కరువు కరాళనృత్యమేనని ఆకలిచావులేనని

పాషాణహృదయులైన పాలకులకు తెలియజేయండి 

 

చెవులుండీ ... మీ ఆకలి కేకలు... వినని

కళ్ళుండీ...మీ ఆకలిచావులు... చూడని

మనసుండీ...మీ ఆక్రందనలు...ఆలకించని

చేతులుండీ...  మీకింత.....చేయూత నివ్వని

అధికారముండీ...మిమ్మల్ని...ఆపదలోఆదుకోని

కుంటి గుడ్డి మూగ చెవిటి పాలకులను

ప్రశ్నించండి సంఘటిత శక్తిగా పోరాడండి 

ప్రతిఘటిస్తేనే... ప్రగతని... 

ప్రశ్నిస్తేనే......ప్రతిఫలమని...

ఉద్యమిస్తే... ఉషోదయమని...

సంఘటిత శక్తే... సమస్యలకు పరిష్కారమన్న

నగ్నసత్యాన్ని తెలుసుకోండి ! 

ఉరుములా ఉరమండి... మెరుపులా మెరవండి

ఉగ్రులై ...ఉద్యమించండి...

నల్లచట్టాలు రద్దయ్యేంతవరకు...

విజయం మిమ్ము వరించేంతవరకు...విశ్రమించకండి....