నిన్న రైతులే రాజులని
మకుటంలేని మహారాజులని
నేడు ఆ రైతన్నల నెత్తిన
మూడు ముళ్ళకిరీటాలు పెట్టి
మురిసిపోతున్నారే
కొత్తగా మూడుకొడవళ్ళునూరి
మెత్తగా అన్నదాతల గొంతులు కోస్తున్నారే
పచ్చని పంటలకు పాడికడుతున్నారే
ఆకలి మంటలకు ఆజ్యం పోస్తున్నారే
రైతన్నలు తినే పచ్చడిమెతుకుల్లో
పురుగుమందులు పిచికారి చేస్తున్నారే?
ఇదెక్కడి న్యాయం ? ఇదెక్కడి ధర్మం?
రేయింబవళ్లురెక్కలుముక్కలు చేసి
పరబ్రహ్మ స్వరూపమైన
అన్నాన్ని ప్రసాదించే రైతన్నలే
మన దేవుళ్ళని నిన్న వారికాళ్లకు మ్రొక్కిన మీరే
నేడు ఆ దేవుళ్ళ మెడలకే ఉరితాళ్లు బిగిస్తున్నారే?
అన్నంపెట్టే రైతన్నల చేతుల్నే నవ్వుతూ నరికేస్తున్నారే ?
ఇదెక్కడి న్యాయం ? ఇదెక్కడి ధర్మం?
ఏ దేశానికైనా...రైతే రాజన్నది...రైతే వెన్నెముకన్నది...
రైతే ఆకలితీర్చే అన్నదాతన్నది... ఒక పచ్చినిజం.......
గుప్పెడు గుండెతో పిడికెడు ఆశతో
బ్రతికేటి అన్నదాతల వెన్నులు విరిచేటి
గుండెల్లో గునపాలు గ్రుచ్చేటి
గుంటనక్కల, గుడ్లగూబల
గుడ్లు పీకేందుకే రైతులు పిడికిలి బిగించి
రాజధానిరోడ్లపై రంకెలు వేస్తున్నా
మొద్దునిద్ర పోయే పాషాణహృదయులైన
ఓ పాలకులారా! ఓ అంధులారా! ఓ అధికారుల్లారా!
ఓ కుంభకర్ణుల్లారా! ఇకనైనా కళ్ళుతెరవండి
రైతునాయకులతో చర్చలు జరపండి
తక్షణమే మూడుచట్టాలను రద్దుచేయండి
కుమిలిపోయే రైతుకుటుంబాలను ఆదుకోండి
నిజమైన "రైతుబాంధవులని" నిరూపించుకోండి



