Facebook Twitter
మూడుచట్టాలొద్దు...రద్దేముద్దు

భారతీయులందరూ

మా కన్నబిడ్డలేనని కన్నతండ్రుల్లా

కాయకష్టంచేసి దుక్కిదున్ని 

ఎండిన ఎడారివంటి బీడుభూముల్లో

చెమటచుక్కల మొక్కలు నాటి‌ 

రేయింబవళ్లు రెక్కలుముక్కలు చేసి

పచ్చని పంటలు పండించి 

ఆకలి మంటలు ఆర్పే అన్నదాతల

కళ్లను కన్నీటి సముద్రాలుగా మారుస్తున్నారే

గుట్టుగా గుండెల్లో గునపాలను గుచ్చుతున్నారే

ఇదెక్కడిన్యాయం ? ఇదెక్కడిధర్మం ?

కంచే చేను మేస్తే ఇక అన్నదాతలకు దిక్కెవరు? 

ఏనేతలను నమ్మాలి? వారు ఏదేవతలకు మొక్కాలి?

 

ఎర్రని ఎండల్లో ఎండిన డొక్కలతో

మాగాణిలో మట్టి పిసికే రైతన్నల గొంతుకలకు

మూడుచట్టాల ఉరితాళ్ళను బిగస్తున్నారే

ఆరుగాలం శ్రమించే రెక్కలు ముక్కలు చేసే 

రైతన్నల రెక్కలువిరిచి పైకెగరలేని పక్షులుగా 

ఆకలితో అలమటించే 

అస్థిపంజరాలుగా మారుస్తున్నారే

ఇదెక్కడిన్యాయం ? ఇదెక్కడిధర్మం ?

కంచే చేను మేస్తే ఇక అన్నదాతలకు దిక్కెవరు?

ఏనేతలను నమ్మాలి? వారు ఏదేవతలకు మొక్కాలి?

 

రైతులరక్తం త్రాగే 

ఎలుగుబంట్లకు

ఎర్రతివాచీలు పరుస్తూ

రైతన్నల పొట్టలుకొడుతున్నారే

గొడ్డుచాకిరి చేసి నడ్డి విరిగిన

రైతున్నలకు పచ్చడిమెతుకులు విదిల్చి

కడుపు నిండిన కార్పొరేట్ సంస్థలకు 

పంచభక్ష్య పరమాన్నాలను వడ్డిస్తున్నారే

ఇదెక్కడి న్యాయం ? ఇదెక్కడిధర్మం ?

కంచే చేను మేస్తే ఇక అన్నదాతలకు దిక్కెవరు?

ఏనేతలను నమ్మాలి? వారు ఏ దేవతలకు మొక్కాలి?

వద్దువద్దు... ఆ మూడు చట్టాల...రద్దేముద్దు