అక్కడెక్కడో ...
మెరుపులు మేఘాలను మ్రింగివేస్తుంటే
ఇక కుంభవర్షాలు కురిసేదెక్కడ ?
అక్కడెక్కడో ...
అంతరంగాన అసూయాగ్ని రాజుకుంటే
ఇక స్పందనలెక్కడ ?
అభినందనల వెల్లువలెక్కడ?
అక్కడెక్కడో ...
చింతలు చీకట్లో చిందులు వేస్తుంటే
ఇక చిరునవ్వుల విందులెక్కడ?
అక్కడెఎక్కడో ....
భక్తిభావం భస్మమైపోతుంటే
ఇక ముక్తిమార్గాలు తెరుచుకునేదెక్కడ ?
అక్కడెక్కడో ...
మృత్యుఘంటికలు మ్రోగుతువుంటే
ఇక శాంతిసందేశాలకు స్థానమెక్కడ?
అక్కడెక్కడో ...
యుద్ధఫిరంగులతో ధరణి ద్దరిల్లుతుంటే
ఇక శాంతికపోతాలు నింగికెగిరేదెక్కడ ?
అక్కడెక్కడో ....
విడాకులు బాకులై
గుండెల్లో గుచ్చుకుంటూవుంటే
ఇక వివాహ సంబందబాంధవ్యాలు
విరితోటలో కుసుమాలై విరబూసేదెక్కడ?
అక్కడెక్కడో ....
మిడతలదండు దాడితో
మిన్ను విరిగి మీద పడుతుంటే
ఇక పచ్చని పంటలు పండేదెక్కడ ?
ప్రజల ఆకలి మంటలు ఆరేదెక్కడ?
అక్కడెక్కడో ...
నల్లనిచట్టాల ఆరనికుంపట్లు రాజేస్తుంటే
ఇక అన్నదాతల ఆశలు చిగురించేదెక్కడ?
అక్కడెక్కడో ....
కర్కశచట్టాల కారుమబ్బులే కమ్ముకుంటూవుంటే
ఇక కర్షకులకళ్ళల్లో కాంతిరేఖలు వెలిగేదెక్కడ?
అందుకే ముందు...
అక్కడ అగాథాలను పూడ్చాలి...
అక్కడ రగిలే అగ్నిజ్వాలల్ని ఆర్పాలి...
అక్కడ కమ్మిన చిమ్మచీకట్లను చీల్చాలి...
అప్పుడే ఇక్కడ వేయిసూర్యబింబాల వెలుగు...



