వీరుడుకాదు,విజ్ఞతకాదు…
తిట్టలేనివారిమీదికి తిరిగి కొట్టలేనివారిమీదికి
అమాయకపు ఒక అడవిజింక మీదికి
ఆకలితో చిరుతపులి లంఘించినట్లు
ఎదిరించే శక్తిలేని వారిని బెదిరించడం
తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పుకు
ఆవేశంతో అరవడం పిచ్చికోపంతో రెచ్చిపోవడం
కక్షగట్టడం కఠినశిక్ష వేయడం
పగ ప్రతీకారం తీర్చుకోవడం
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లే
దరిద్రులను దోచుకున్నవాడు ధనవంతుడు కాడు
నిర్దోషుల, నిస్సహాయుల, నిరాయుధుల మీద
విరుచుకుపడ్డవాడు వీరుడుకాదు,అది విజ్ఞతకాదు
ఆపదలో వుంటే ఆదుకున్నవాడే ఆపద్భాందవుడు
నిరుపేదలకష్టాలు తీర్చినవాడే నిజమైననాయకుడు
చరిత్రను చదవక సృష్టించినవాడే చిరస్మరణీయుడు



