కొందరు అందరికీ అర్థం కారు
కారణం వారు అపరిచితులు
అట్టి వారితో వ్యాపారమైనా వ్యవహారమైనా
కాస్త జాగ్రత్త వారితో కలిసి చేసేది ఏదైనా
మట్టిఏనుగును నమ్మి నట్టేట్లో దిగినట్లే
చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే
గుడ్డివాడికి అద్దం చూపినట్లే
కుంటివాడికి నాట్యం నేర్పినట్లే
నవ్వే పులినోట్లో తల దూర్చినట్లే
పట్టపగలు నింగిలో చుక్కలు చూసినట్లే
ఎండమావిలో నీళ్ళకోసం వెదికినట్లే
అలలు ఆగిన తర్వాత స్నానం చేసినట్లే
ఒట్టిపోయిన గేదె దగ్గర పాలు పితికినట్లే
ఒంటికాలు గుర్రమెక్కి రేస్ లో పాల్గొన్నట్లే
శతృవుతో పోట్లాడితే సమస్య
శతృవుతో మాట్లాడితే పరిష్కారం
ఈ జీవితం సంద్రమైతే
సుఖసంతోషాలు జలచరాలైతే
వాటిని పట్టుకోవాలంటే
కాలమనే గాలాన్ని విసరాలి
ఈ జీవితం విషాదభరితమైతే
కష్టనష్టాలు బాధలు భయాలు భూతాలైతే
వాటిని తట్టుకోవాలంటే
కాలమనే శూలాన్ని విసరాలి
కాలం తల్లక్రిందులైతే భూగోళమంతా గందరగోళం
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం
కొందరు ప్రాణమిత్రులే బద్దశతృవులౌతారు
కొందరు బద్దశతృవులే ప్రాణమిత్రులౌతారు
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం
కొందరిని కాలం క్షణంలో చిత్రంగా కలుపుతుంది
కొందరిని కాలం క్షణంలో కౄరంగా విడదీస్తుంది
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఇద్దరు ఒక్కటౌతారు
నేడు ఇద్దరు ఒక్కటైనా
రేపు విడిపోయి దూరమైతారు దుఖ్ఖితులౌతారు
కారణం ఒక్కటే కలికాలం అదివిధిఆడే వింతనాటకం
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం
కలిసి వుంటేనే కలదు సుఖం ముందు ముందు
స్వపరాధంతో కలిగే గాయాలకు కాలమే ఒక మందు



