రెక్కలుముక్కల్ చేసే
రైతన్న ఇప్పుడు
వెక్కరించే మేఘాలను
వేడుకోవడం లేదు
నీటిచుక్కలకోసం
వరుణదేవున్ని
ప్రార్థించడం లేదు
పంటలను
ధ్వంసం చేసే
చీడ పీడలకు
పురుగులమందు
కొట్టడం లేదు
గిట్టుబాటుధరల కోసం
పట్టుబట్టడం లేదు
కానీ....కణకణమండే
అగ్నిపర్వతంలా
రగులుతున్నాడెందుకు?
రాజధాని రహదారుల్లో
రంకెలు వేస్తున్నాడెందుకు?
నాగలి పట్టి నడిరోడ్డుపై
నిప్పై నిలుచున్నాడెందుకు?
మూడు చీకటి చట్టాల
ముప్పు ముందున్నందుకు...
నిన్న...కుంభవర్షాలు కురిసినా...
కరువు కాటకాలు కాటువేసినా...
కలవరపడని... కన్నీరు కార్చని...
కర్షకులందరి మెదళ్ళను తొలిచేదొక్కటే
తమ బ్రతుకుపంట"నాశించి నాశనం చేసే
కాయ తొలిచేటి రసం పీల్చేటి
ఈ మూడు కొత్త పురుగులకు
ఏ పురుగులమందును పిచికారి చేయాలాని?
నేడు మెల్లగా మెత్తగా కుత్తుకలు త్రెంచే
ఈ కొత్త కత్తులవంతెనను దాటడమెలాగని?
అందుకు మార్గమొక్కటే ఓ రైతువీరులారా!
"ఆశే" శ్వాసగా...
"ఐక్యతే" ఆయుధంగా...
"ఉద్యమమే" ఊపిరిగా... ముందుకు సాగాలి
అందరూ సమిష్టిగా..... కత్తులై కదం తొక్కాలి
అప్పుడే ఈకుటిలజఠిల సమస్యకు చక్కనిపరిష్కారమంట
అప్పుడే ఈ రైతన్నల బ్రతుకుల్లో పండేనంట బంగారుపంట



