Facebook Twitter
మూడుచట్టాలతో ముప్పే....

గుండెల్లో... ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలైతేనో...

కళ్ళల్లో... ఎన్ని కన్నీటి సముద్రాలు ఉప్పొంగితేనో...

కట్టుకున్న...ఎన్ని ఆశలఆకాశహార్మాలు 

నిట్టనిలువునా కుప్పకూలితేనో....

కన్న...ఎన్ని కమ్మని కలల పచ్చనిపంటల్ని 

మిడిమాలపు మిడతలదండొచ్చి మింగివేసుంటేనో....

ముందు భవిష్యత్తంతా అంధకారమేనన్న భయంతో

 కారుచీకటిలోఎన్నో కన్నీటిచుక్కలు రాల్చితేనో...

నల్లచట్టాలు చాటుమాటుగా కాటువేసే కరోనాభూతంలా

ఎంతగానో భయభ్రాంతులకు గురిచేస్తేనో....

నిగ్రహంకోల్పోయి అన్నదాతలింతటి ఉగ్రరూపం దాల్చేది

 

సన్న చిన్నకారు రైతుల పొట్టగొట్టి 

కార్పొరేట్ సంస్థలకడుపునింపే  

ఎర్రతీవాచీ పరచే ఈ నల్లచట్టాలు మాకెందుకని

కాకులను కొట్టి గద్దలకేసే ఈ ద్వందవైఖిరికి 

నిరసనగా రోడ్డు రోకోలు ధర్నాలు చేస్తుంటే

నిర్దయతో ఎంతో నిర్భంధం చేసినా

రోడ్లను సరిహద్దుల్ని దిగ్బంధం చేసినా

కర్షక కార్మిక శక్తులన్నీ ఒక్కటై 

ముక్తకంఠంతో నిరసిస్తూ నిప్పులు కురిపిస్తూ

ఢిల్లీపీఠం కదిలేలా దిక్కులు పిక్కటిల్లేలా

కుంభకర్ణులు నిద్రలేచేలా నల్లచట్టాలను రద్దుచేసేలా 

ధర్మయుద్దానికి సిద్ధమై ఉద్యమ కెరటాలై 

ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉద్యమిస్తున్న 

రైతన్నలకు మద్దతిద్దాం మానవత్వాన్ని చాటుకుందాం