Facebook Twitter
ఓ యువతా ! విను నా కవిత !!

ఉత్తముడిలా వుండు

ఉత్తర కుమారుడిలా వుండకు

ఉడుతలా వుండు, మిడతలా

మిణుగురు పురుగులా వుండకు

 

గదిలో గబ్బిలంలా

గుడిలో గుడ్లగూబలా

పంజరంలో పక్షిలా

దారం తెగిన గాలిపటంలా

పదునులేని కత్తిలా వుండకు

 

ఎదురు లేని ఏనుగులా

ఎత్తైన ఎవరెస్టు శిఖరంలా

అడవిలో మృగరాజులా

చీకట్లో సైతం వేటాడే

చిరుతపులిలా వుండు

 

బుసలు కొట్టే కోడెనాగులా

నింగికెగిరే తారాజువ్వలా

నిశిరాత్రిలో నవ్వే నక్షత్రంలా

దూసుకు పోయే రామబాణం

చొచ్చుకుపోయే

అరుణోదయ కిరణంలా వుండు

 

పండిన చేనులా

నిండిన చెరువులా వుండు

నీతిగా నిజాయితీగా ఉండు

నిస్వార్థంగా వుండు నిప్పులా మండు

ఉత్కృష్టమైన ఈ మానవ జన్మ

మళ్లీ మళ్లీ రాదని మాత్రం గుర్తుంచుకో