ఓసీ అక్కసు కక్కిన
ఓ కరోనా రక్కసీ !
ఎక్కడే ? నీవెక్కడ?
ఓసీ కంటికి కనిపించక
కాటువేసే ఓకాలసర్పమా !
ఎక్కడే ? నీవెక్కడ?
ఓసీ మనుషులను మ్రింగే
ఓ మాయదారి మహమ్మారి !
ఎక్కడే ? నీవెక్కడ?
నిన్న నీవు మా అనుకోని అతిథివి
కాదు మా పాలిటహంతకురాలివి
నిన్న నీవు నివురుగప్పిన నిప్పువు
కాదు,ముసుగు కప్పుకున్న మృత్యువు
నిన్న నీవు వైద్యశాలకు శ్మశానానికి
మధ్యన వ్రేలాడిన భయంకరభూతానివి,
కాదు కుత్తుకలు త్రెంచిన కత్తులవంతెనవి
నిన్న నీవు రహస్యంగా వచ్చావు
ఊహించని విపత్తును తెచ్చావు
ఉగ్రరూపం దాల్చి అగ్రరాజ్యాలనుసైతం
ఉక్కిరిబిక్కిరి చేశావు ఊబిలో త్రోశావు
రాత్రరాత్రికే రక్తసంబంధాలను రద్దుచేశావు
పెనవేసుకున్న అనుబంధాలనెన్నింటినో
విడదీసి వీధిలోకి,కాదు విధినోట్లోకి విసిరావు
ఎన్నో పచ్చనికాపురాల్లో చిచ్చురేపావు
ఎందరి బ్రతుకుల్నో బలిదీసుకున్నావు
ఎందరి రెక్కలనో విరిచి ముక్కలుచేసి
ఎగరలేని పక్షులనుచేశావు గుండెల్ని చీల్చావు
రాబందులా రక్తాన్ని పీల్చావు పిప్పిపిప్పిచేశావు
ఓసీ అక్కసు కక్కిన
ఓ కరోనా రక్కసీ ఎక్కడే ? నీవెక్కడ?
ఇకనైనా నీ విలయతాండవమాపి,
నీ ప్రళయ గర్జనలాపి, నీ కరాళనృత్యమాపి
మారిపో మారిపో కాంతిరేఖలా...
ఎగిరిపో ఎగిరిపో శాంతికపోతంలా...
సాగిపో సాగిపో మలయమారుతంలా
కలిసిపో కలిసిపో కారుచీకట్లో...
నిలిచిపో నిలిచిపో మృత్యువుముంగిట్లో...
మళ్ళీరాకే ఓ కతర్నాక్ కరోనా !



