Facebook Twitter
ఉన్మాదులపై ఉక్కుపాదం

మహిళలు అర్ధరాత్రిలో స్వేచ్ఛగా తిరిగినరోజే

మన దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన రోజు

అన్న మన జాతిపిత బాపూజీ కన్న కలలు

ఎప్పుడు ?ఎప్పుడు ?సాకారమయ్యేదెప్పుడు ?

 

మన తల్లి భరతమాత స్త్రీనే

మన న్యాయ దేవత స్త్రీనే

నిన్ను నన్ను కన్నది ఒక అమ్మనే

స్త్రీని దేవతన్నారు శక్తి స్వరూపిణన్నారు

ఆకాశంలో సగభాగమన్నారు, కానీ

కంటపడితే, కాలు బయటపెడితే చాలు

వెంటపడుతున్నారు వేధిస్తున్నారు

వదల బొమ్మాళీ మిమ్ము వదలమంటూ

కామాంధుల వేట మొదలౌతుంది

ఆడదంటే ఆటబొమ్మేనా ? అంగడి సరుకేనా?

ఎక్కడ ?ఎక్కడ ? ఈ స్త్రీజాతికి రక్షణ ఎక్కడ ?

 

ఆడజన్మ ఎత్తితే ఈ నేలపై

ఇంటి నుండి ఆఫీసు వరకు

జననం నుండి మరణం వరకు

ముందున్నవి ముళ్ళబాటలే 

ప్రక్కలో బల్లాలే బాకులే మరతుపాకులే

కళ్ళముందు తేనె పూసిన కత్తులే 

మేక వన్యపులులే అందరూ శత్రువులే... 

కాలేజీలో...పోకిరికుర్రాళ్లు 

బజారులో... రౌడీలు రాక్షసులు

ఆఫీసులో...సహఉద్యోగులు 

స్కూల్లో...పాఠాలు బోధించే గురువులు

ఆశ్రమాల్లో.... దొంగబాబాలు

నేడు కొత్తగా గుడిలో...పూజారులు 

ఎక్కడ ?ఎక్కడ ? ఈ స్త్రీజాతికి రక్షణ ఎక్కడ? 

 

ఔను ఈ మగమృగాళ్ళు మారినప్పుడే?

నిన్ను ఒడిలో పెట్టుకునో ఊయల్లో వేసో 

జోకొట్టి జోలపాటపాడి హాయిగా నిన్ను

నిదుర పుచ్చిన ఆ తల్లి నిన్ను నమ్మిన నీ‌ చెల్లి

నిశ్చింతగా ప్రశాంతంగా నిదురపోయినప్పుడే

నిర్భీతితో ఒంటరిగా స్వేచ్ఛగా వీధిలో తిరిగినప్పుడే ఈ

ఊసరవెల్లులపై ఈ ఉన్మాదులపై ఉక్కుపాదం మోపినప్పుడే

స్త్రీజాతికి ఈ విషసర్పాలనుండి ఈ కామపిశాచుల నుండి విముక్తి