అత్యాచారాలంటేనే
ఆరని చితిమంటలు
ఓ అమాయకపు
అమ్మాయిల్లారా !
ఎప్పుడైనా ఎక్కడైనా
మగువలుగురైతే మానభంగానికి
వేధించి వెతలకు గురిచేసి
వెలివేసే ఈ వెర్రి సంఘానికి
భయపడితే చాలు
బ్రతుకు బుగ్గిపాలు
ఉద్యమిస్తేనే స్త్రీ
జాతికి ఉషోదయమన్న
ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !
ఓ అమాయకపు
అమ్మాయిల్లారా !
మీరుకమ్మని కలలుకనే
కన్యపిల్లలే కావొచ్చు కానీ
ఆ కలలను కాలరాస్తే
మీలో నిగ్రహం నశిస్తే
ఉగ్రరూపం దాల్చే
శత్రువులను చీల్చే
కలకత్తా కాళికలు మీరని
మీరు పూరిగుడిశల్లో
పుట్టివుండవచ్చు కానీ
గాండ్రించి మానవమృగాలను
చీల్చిచెండాడే
చిరుతపులులు మీరున్న
ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !
ఓ అమాయకపు
అమ్మాయిల్లారా !
మీరు ఆకారానికి
ఆడపిల్లలే కావచ్చు కానీ
అన్యాయాలకు
అక్రమాలకు పాల్పడే
అవమానాలకు గురిచేసే
అక్రమార్కులను అంతంచేసే
అగ్గిపుల్లలు మీరని
కాంతినివ్వగలరని
కాల్చిబూడిద చేయగలరని...
ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !
ఓ అమాయకపు
అమ్మాయిల్లారా !
మీరు అబలలే కావొచ్చు, కాని
అమ్ముడుపోవడానికి
మీరు అంగడిబొమ్మలు కాదని
మీరు ఆదిపరాశక్తికి ప్రతిరూపాలన్న
ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !...



