విశ్వంలో పుట్టిందొక విషపురుగు
విహంగలా విహరిస్తుంది
అందరి ప్రాణాలను హరిస్తుంది
తాను అదృశ్యంగా వుంటూ
తన నోటికి అందిన వారిని
మ్రింగేసి ఆకలి తీర్చుకుంటుంది
తన చేతికి చిక్కిన వారిని
తన కంటికి కనిపించిన వారిని
తేలులా కుట్టి, పాములా కాటేసి
అనకొండలా చుట్టేసి
వీరులను, శూరులను సైతం
వికలాంగులను చేస్తుంది
తనవైపు చూసినా, తనను తాకినా
శవాలైపోతారని శాపం పెడుతుంది
ఇళ్ళ ముందు నిలబడి
ముసిముసి నవ్వులు నవ్వుతుంది
ఇళ్ళనుండి బయటికి వస్తే
బడిత పూజేనంటుంది
మృత్యువై ముద్దుపెట్టుకుంటుంది
కండలు తిరిగిన వారినైనా
కోట్ల ఆస్తివున్న కోటీశ్వరులనైనా
పూరిగుడిశలోని నిరుపేదలనైనా
క్షణాల్లో కబలించివేస్తుంది, నిర్దాక్షిణ్యంగా
కాటికీడుస్తుంది, కసితీర్చుకుంటుంది
కళ్ళముందున్న శవాల గుట్టలు మీద
చిందులు వేస్తుంది, విందులు చేసుకుంటుంది
డాక్టర్లను,నర్సులను వెక్కిరిస్తుంది
వారి ప్రక్కనే నక్కినక్కి తిరుగుతుంది
సైనికులను, సైంటిస్టులను
సైతం గజగజ వణికిస్తుంది, గడగడలాడిస్తుంది
అగ్రరాజ్యాల అణుబాంబులతో ఆడుకుంటుంది
ఎంత వేడుకున్నా చైనాకు వెళ్ళనంటుంది
తనకు చావేలేదని, తనకు మందేలేదని
తనకెదురేలేదంటూ విర్రవీగుతుంది
వికటాట్టహాసం చేస్తుంది,నేనే విశ్వవిజేతనంటుంది
అతి ప్రమాదకరమైన, అతి భయంకరమైన
అనుకోని ఈ అతిథికి ఇక్కడే
ఇండియాలోనే అగ్నిపూజ చేద్దాం
అందరం కలిసి కరోనా విషపురుగును
అంతం చేద్దాం,ఘనంగా దీనికి అంత్యక్రియలు చేద్దాం



