ఓ దేవుళ్ళారా ! దేవతలారా !!
ఎక్కడున్నారు ? మీరెక్కడున్నారు?
లాక్ డౌన్ లో మీరు కూడా లాకైపోయారా?
ఊహాన్లో పుట్టి ఉన్మాదిలా ఉగ్రవాదిలా
మాపై కత్తులు దూస్తున్న మా కుత్తుకలు కోస్తున్న
మా ప్రాణాలతో చెలగాట మాడుతున్న
మా శ్వాస మీద స్వారీ చేస్తున్న
మృత్యువై విశ్వమంతా వ్యాపిస్తున్న
వీరవిహారం చేస్తున్న, విరుచుకుపడుతున్న
గబ్బిలంలా,చిమ్మచీకట్లోఎగురుతున్న
గజ్జికుక్కలా,దేశాలన్నీ తిరుగుతున్న
ఈ కరోనా మాయదారి మహమ్మారిని
కాల్చి బూడిద చేసే మంత్రమేలేదా?
చంపి సమాధి చేసే మార్గమేలేదా ?
ఇళ్ళల్లో మేమంతా ఇరుక్కుపోయి
క్షణక్షణం,భయంతో మేమనుభవిస్తున్న
ఈ మానసిక క్షోభకు అంతమేలేదా?
ఓ దేవుళ్ళారా ! దేవతలారా !!
ఎక్కడున్నారు ? మీరెక్కడున్నారు?
అగ్రరాజ్యాలు సైతం అల్లకల్లోలమౌతున్నాయ్
కనిపించని ఆ కరోనాను ఖతం చెయ్యలేక
ఎదుర్కోనే దారి లేక దైర్యం లేక
మందు కనుగొనే మార్గం లేక
అటు ఆసుపత్రుల్లో రోగులు - లక్షలు లక్షలు
ఇటు శ్మశానాల్లో శవాలు - గుట్టలు గుట్టలు
అటు కళ్ళల్లో - కన్నీటి సముద్రాలు
ఇటు గుండెల్లో - అగ్ని పర్వతాలు
అటు ఆదుకోమని వేడుకునే - కోట్ల జనం
ఓ దేవుళ్ళారా ! దేవతలారా !!
ఎక్కడున్నారు ? మీరెక్కడున్నారు?
తమ ప్రాణాలనే ఫణంగా పెట్టి,
నిద్రాహారాలు మాని,నిత్యం శ్రమిస్తున్న,
నిస్వార్థంతో సేవలు అందిస్తున్న
ఆ యముడితో భీకరపోరాటం చేస్తున్న
మా డాక్టర్లే మా నర్సులే మా రక్షకభటులే
మా పారిశుద్ధ్య కార్మికులే
కరోనా రోగుల పాలిట కనిపించే దేవుళ్ళు,
మీ ముక్కోటి దేవతలకు మా ప్రార్థనొక్కటే
ఈ కరోనా రక్కసి కోరలకు చిక్కకుండా
ప్రతిఒక్కరిని రక్షించమని, కరుణించమని,కాపాడమని.
(కరోనా వ్యాధి సోకి, కోలుకొని తిరిగి విధులకు హాజరైన ఒక
ఓ నర్సు గురించిన వార్త చదివి "కనిపించే దేవత" ఆమేనని చలించి వ్రాసిన కవిత



