చూస్తుండగానే సమయం అలా గడిచిపోయింది...
ఎప్పుడు ఎలా గడిచిపోయిందో తెలియనేలేదు!
ఈ జీవితపు ఒడిదుడుకుల్లో ఎలా వచ్చిందో
వయస్సు ఎలా కరిపోయిందో తెలియనేలేదు!
భుజాలపైకి ఎక్కి గెంతులువేసిన పిల్లలు...
ఎప్పుడు భుజాలు దాటి ఎదిగారో తెలియలేదు!
అద్దె ఇంటితో మొదలైన మా కాపురము
ఎప్పుడు సొంత ఇంటికి మారిందో తెలియనేలేదు!
సైకిల్ పై సాగించిన సరసాల సరదా సంసారం...
ఎప్పుడు కారులో కాపురం పెట్టిందో తెలియలేదు!
పిల్లలుగా బాధ్యతను ఎరిగి మసలిన మేము
ఎప్పుడు పిల్లలకి భారమయ్యామో తెలియనేలేదు!
గంగిరెద్దులా ఊరూరా తిరిగిన ఉద్యోగంలో ...
ఎప్పుడు రిటైర్ మెంట్ వచ్చిందో తెలియలేదు!
పిల్లలకోసం డబ్బును కూడబెట్టి ఆదాచెయ్యడంలో
ఎప్పుడు పిల్లలు దూరమయ్యారో తెలియనేలేదు!
అప్పుడు ఇంత టైం దొరికితే కునుకు తీసేవాళ్ళం...
నిద్రని రాత్రులెప్పుడు దొంగిలించాయో తెలియలేదు!
నల్లని దట్టమైన జుట్టును చూసి మురిససే మాకు
తెల్లని మైదానం ఎప్పుడేర్పడిందో తెలియనేలేదు!
అప్పుడు కుటుంబమంతా కలిసే వుండేవాళ్ళం...
ఎప్పుడు విడివడి ఇద్దరం మిగిలామో తెలియలేదు!
ఇప్పుడు మాకోసమేదైనా చేసుకుందామనుకుంటే
శరీరం ఎందుకు సహకరించదో తెలియడమేలేదు!



