Facebook Twitter
ఓ అమ్మనాన్నలు ఒక్కసారి ఇలా ఆలోచించరా!

కొందరు మధ్యతరగతి తల్లిదండ్రులు
కోటీశ్వరుల్లా నటిస్తారు నల్లకోట్లు ధరించి 
అప్పులుచేసి కోట్లు ఖర్చుచేసి చేస్తారు
పిల్లల పెళ్ళిళ్ళు అందరి మెప్పుకోరి

పెళ్ళంటే త ప్పెట్లు తలంబ్రాలే కాదు
పెళ్ళంటే ఖరీదైన దుస్తులు
ఒంటినిండా ధగధగ మెరిసే
బరువైన ఖరీదైన బంగారు నగలు
నోరూరించే వంద రకాల వంటకాలు

ముత్యాల పందిరిలో
మంగళ వాయిద్యాల మధ్య
పూజారి శ్లోకాల మధ్య
మూడుముళ్ళు పడగానే
వచ్చినందుకు వధూవరులను
నాలుగు అక్షింతలువేసి ఆశీర్వదించి
ఆపై బఫేవిందును
ఆరగించి వెళ్ళే అతిథులు

ఈ కమనీయమైన కళ్యాణాన్ని
ఈ రమణీయమైన కళ్యాణ వేదికను
ఈ రుచికరమైన కమ్మని భోజనాన్ని
ఎంత కాలం గుర్తుపెట్టుకుంటారో 
తినలేక ఎన్నో ఐటమ్స్ వృధా చేసి
ప్రక్కనే డస్ట్ బిన్ లోకి విసిరిన
ఎంగిలి విస్తరాకులకే ఎరుక ! 

అలా లక్షలు కోట్లు కుమ్మరించి
అంగరంగ వైభోగంగా ఆర్భాటంగా
పోటీపడి వివాహాలు చేసేకన్నా

కొంత ఖర్చు తగ్గించుకొని
చేసిన అప్పులు తీరక
ఆత్మహత్యలు చేసుకునే అన్నదాతల
అప్పులు తీరిస్తే ఎంత బాగుంటుందో!

కొంత ఖర్చు తగ్గించుకొని
అమ్మానాన్నలు ఎవరో తెలియక
వీధుల్లో చెత్తకుండీల దగ్గర
నాలుగు ఎంగిలి మెతుకులకోసం
కుక్కలతో కుస్తీ పట్టే
అనాధల ఆకలి తీరిస్తే
ఎంత ఘనంగా వుంటుందో!

కొంత ఖర్చు తగ్గించుకొని
ఆ పెళ్లిరోజే కొన్ని నిరుపేద జంటలకు
కళ్యాణం జరిపిస్తే  
ఎంత వైభవంగా వుంటుందో!

ఎంత గౌరవం మీకు దక్కుతుందో!
ఒక్కక్షణమిలా ఆలోచిస్తే మంచిదేమో
కోట్లు ఖర్చుపెట్టే ముందు