Facebook Twitter
ఎలా? ఎలా? ఎలా ?

ఒక్కసారే వెయ్యి సమస్యలు
చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తే
మనిషి తట్టుకోవడమెలా?
ఒక్కసారే వంద విషసర్పాలు
బుసలు కొడుతూ ఇంటిలోదూరితే
మరి పట్టుకోవడమెలా?

అందుకే మీ సమస్యలు
చలిచీమలైతే కుడతాయి
పాములూ తేల్లైతే కరుస్తాయి
పులులు సింహాలైతే చంపేస్తాయి
కొండశిలువ అనకొండలైతే మింగేస్తాయి

అందుకే మీ సమస్యలు
తొలకరి జల్లులైతే మురిపిస్తాయి
చిరుజల్లులైతే తడిపేస్తాయి
కుంభవర్షాలైతే భయపెడతాయి
భీకరతుఫానులైతే బీభత్సం సృష్టిస్తాయి
వరదలయితే ఆస్తినష్టం కలిగిస్తాయి
ఇక సునామీలైతే ప్రాణాలనే హరిస్తాయి

అందుకే మీ సమస్యలు
చిన్నవైతే మనస్పర్ధలొస్తాయి
పెద్దవైతే వేడివేడి చర్చలకు దారితీస్తాయి
తీవ్రమైతే తిట్టుకోవడాలు జుట్టుపట్టుకోవడాలు కొట్టుకోవడాలు
ముదిరితే కేసులు పెట్టుకోవడాలు
కోర్టుకెక్కడాలు జరుగుతాయి
మరీ ముడిపడి ముళ్లకంచెలా

మారితే విడాకులు తీసుకోని
విడిపోయేలా చేస్తాయి తీరని
విషాదాన్ని మిగులుస్తాయి

అందుకే మీ సమస్య
చిన్నదా పెద్దదా అన్నది కాదు సమస్య
వచ్చిన వంటనే మీరు స్పందించారా

లేదా అన్నదే ముఖ్యం
లేదంటే చివరికది
చిలికి చిలికి గాలివాన ఔతుంది
నివురుగప్పిన నిప్పవుతుంది
ముందర ఒక ముప్పవుతుంది
ఊపిరితీసే ఒక ఊబి ఔతుంది జాగ్రత్త.