నేను, నాది అనే భావన నశించి
మనము, మనది అనే భావన ఉదయిస్తేనే
జీవితానికి పరిపూర్ణమైన అర్థం తెలుస్తుంది.
వాసన చూసి పువ్వును,
రుచిని చూసి కాయను,
ఇంటిని చూసి ఇల్లాలిని,
విద్యను చూసి గురువును,
గుర్తుపట్టినట్లుగా ,
ఉన్నతమైన
ఉదాత్తమైన లక్షణాలున్న
ప్రతిమనిషిని గుర్తించాలి గౌరవించాలి
మనసును అదుపాజ్ఞల్లో పెట్టుకున్నవాడే
సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండగలడు.
ధర్మబద్ధంగా జీవించగలడు.
కట్టెగా మారేవరకు
తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండగలడు.
పురాణాలను పుక్కిట పట్టడం,
అవసరమైనచోట్ల ధాటిగా
ఉదాహరించడం గొప్ప కాదు.
అందులోని మేలిమి రత్నాలను ఎంచుకుని
వాటితో మనసును అలంకరించుకోగలగాలి. అప్పుడే అలాంటి మనసు కలిగిన మనిషి
రత్నంలా ఆణిముత్యంలా మెరిసిపోతాడు
నది నదిలా ప్రవహించినంత కాలం
అది బహు గొప్పదే కాని
సముద్రంలో కలిశాక తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.
మనసు అదుపులో ఉన్నంత కాలం
మనిషి మహాత్ముడే
కాని కోరికల సంద్రంలో కొట్టుకుపోయాక
మనిషి తన ఉనికినే కోల్పోతాడు



