భార్యాభర్తలు ఒకరితో ఒకరు
సరదాగా మాట్లాడుకోవాలి
అనురాగముతో ఆప్యాయతతో
ప్రేమతో పలకరించుకోవాలి అంతేతప్ప
వెకిలిగా నవ్వరాదు వేధించరాదు
నంగనాచిలా ఎవరూ నటించరాదు
ఎదురుపడితే ఛీ ! ఛీ ! అంటూ మూతి
ముడుచుకోరాదు ముఖంతిప్పుకోరాదు
ఒకరినిమరొకరు పురుగులా చూడరాదు
మనసు కళుక్కుమనేలా
కత్తులతో పొడిచినట్లుగా
సూదులతో గుచ్చినట్లుగా
పుండు మీద కారం చల్లినట్లుగా
సూటిపోటి మాటలు మాట్లాడరాదు
పెద్దగొంతుతో మాట్లాడుకోరాదు
కాకుల్లా అరవరాదు పొడవరాదు
కుక్కల్లా మొరగరాదు కరవరాదు
ఒకరినొకరు అవమానపరచుకోరాదు
ఎత్తిపొడుపు మాటలు మాట్లాడరాదు
మదిలో రగిలే అపార్ధాల మంటలు
ఆరవని అనుమానపడరాదు, అతకని
ఆత్మలతో అర్థం చేసుకోలేనివారితో,ఈ
గతుకుల బ్రతుకుబండినిలాగలేమనరాదు
పొద్దస్తమానం పోట్లాడుకోరాదు
జుట్టు పట్టుకుని కొట్లాడుకోరాదు
విడిపోదాం విడిపోదామని
విడాకులు తీసుకుందామని
పదేపదే అదేపనిగా అనరాదు
మధ్య అడ్డుగోడలు కట్టుకుందామనుకోరాదు
దూరంగా సుదూరంగా వెళ్లిపోదామనుకోరాదు
సుఖము,శాంతి సమాధానం
కలిసి ఉంటేనే కలదని
విడిపోతే విషాదమేనని విడమరచి చెబుదాం,
విన్న దంపతులందరూ ధన్యజీవులే పుణ్యమూర్తులే.....



