అందర్నీ నమ్మకండి
ఆచితూచి మాట్లాడండి
పనిలో ఏకాగ్రత అవసరం
మీ ఓర్పుకు పరీక్ష కాలమిది
కాసుల వర్షం కురుస్తోంది
అనుకూల కాలం నడుస్తోంది
పట్టుదలతో ముందడుగు వేయండి
చంచలత్వాన్ని దరి చేరనియ్యవద్దు
లక్ష్యం చేరేవరకు ప్రయత్నిస్తూనే ఉండండి
సాహసం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి
గిట్టనివారు చేసే ఆరోపణలు పట్టించుకోవద్దు
స్పష్టమైన ప్రణాళికతోనే విజయం లభిస్తుంది
ఆత్మవిశ్వాసమే ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది
స్థిరమైన మనసుతో మంచినిర్ణయాలు తీసుకోండి
పనులుపూర్తయ్యే వరకు నిరంతర సాధన చేయండి
ఇట్టి మీ రాశిఫలాలు నిజం కానందుకు
నిరాశ చెందకండి ఆ విధివ్రాతను నమ్మకండి
తిథి వార నక్షత్రఫలాలను తిట్టకండి
ఇవి మా తలరాతలంటూ తలలు పట్టుకోకండి
తమ విధులను తాము కసితో కృషితో
ఒక లక్ష్యంతో శ్రధ్ధతో ఏకాగ్రతతో ఓర్పుతో నేర్పుతో
నిర్వహించువారు తప్పక విజయాన్ని సాధిస్తారు
ఔను మీరు ఈ రాశిఫలాలను ఈ రంగురాళ్లను
పేరులో అక్షరాలు తారుమారుచేసినంతనే
క్షణాల్లో జాతకాలు మారిపోతాయని చెప్పే
ఆ ఇంద్రజాలికుల మాయమాటల్నినమ్ముతారో లేక
ఈ రాశిఫలాలన్నీ గట్టున పెట్టి మట్టినే నమ్ముకుని
తమ రక్తాన్ని స్వేదంలా చిందించి
రాత్రింబవళ్ళు రెక్కలుముక్కలు చేసే
పచ్చని పంటలు పండించే
అందరి ఆకలి మంటలను ఆర్పే
ఆ రైతన్నల స్వశక్తిని ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని
ఆదర్శంగా తీసుకుంటారో మీ ఇష్టం ఆపై మీ అదృష్టం



