Facebook Twitter
ఆర్జించు...అనుభవించు...అస్తమించు

కంటపడిందంతా కావాలని
వెంటపడే ఓ ఒంటరి తుంటరీ
నీవు ఎంతటి వెర్రివాడవోయ్
వెళ్ళేటప్పుడు నీ వెంట
ఏది రాదు ఎవరూ రారు
కంటతడి పెడతారు తప్ప కలిసిరారు

వచ్చేప్పుడు నీవు ఒంటరిగా వచ్చావు
వెళ్లేప్పుడు వేలవేల కోట్లు ఉన్నా
అన్నీ ఈ నేలమీదనే వదిలేసి
రాలిపోతావు ఎండుటాకులా
తరలిపోతావు మరలిరాని లోకాలకు 
మరెందుకు ఈ మేడలు ఈ మిద్దెలు?
మరెందుకు ఈ వేలకోట్ల నోట్లకట్టలు ?
మరెందుకు ఈ ఆస్తులు అంతస్తులు ?

ఔరా ఇదంతా నీ ఆశే  నీ శ్రమే నీ భ్రమే
రేపు నీవు పైకి నీవు ఆర్జించిందంతా క్రిందకి
అంతా మాయే ఆవలివైపు నీవు నీ ప్రాణం
ఈవలి వైపు నీవాళ్ళు నీఆస్తులు నీధనం
మళ్ళీ కలుసుకోలేరు మళ్ళీకలిసి ఉండలేరు

అందుకే ఈ భూమి మీద
ఉన్నంతకాలం తినాలి తిరగాలి
వయసుడిగితే వ్యాధులు ‌మురితే
ఏమీ తినలేవు ఏమి వినలేవు కనలేవు 
నిన్న నీవిక్కడ ఎంతో కష్టపడి ఇష్టపడి
ఎంతో ఆశపడి ప్రయాసపడి
ఎంతో బాధపడి భ్రమపడి శ్రమపడి
ఆర్జించినదంతా రేపు వేరొకరికిచ్చి
పారిపోవాలి తప్పక పరలోకానికి 
అందుకే ఓ మనిషీ "ఆర్జించు" కానీ "కాసింతైనా"
"అనుభవించు" ఆపై ఆత్మతృప్తితో "అస్తమించు"