ఆత్మహత్యలతో అన్ని
అంతమవుతాయా ? లేదే
చావే సమస్యలకు
పరిష్కారమా? కాదే
ఈ మానసిక వ్యధలకు
కాదు మరణం ఒక మందు...
అది ఘోరవిషాదాల విందు...
ఆ సత్యం తెలుసుకో ముందు...
ఈ జీవితం చాలా చిన్నది ఏమన్నది?
నీలో ఓపిక ఉన్నంతవరకు
నీలో ఊపిరి ఉన్నంతవరకు
నిన్ను వేధించే మానసిక వ్యధలతో
నిన్ను వెంటాడే ప్రాణభయభూతంతో
నిన్ను చాటుమాటుగా
కాటు వేయాలని పొంచి ఉన్న
సమస్యల సర్పాలతో పోరాడమన్నది
ఈ జీవితం చాలా చిన్నది ఏమన్నది?
నిత్యం చిరునవ్వు నవ్వుతూ
ఆవగింజంత ఆశతో జీవించమన్నది
చితి ఒడికి చేరాలన్న చింత వద్దన్నది
ఎంతటి విపత్తుల హోరుగాలి వీచినా
ఎంతటి అవాంతరాల అవరోధాల
జడివానలు కురిసినా
నీ ఆశాదీపాన్ని ఆరనియ్యకన్నది
ఈ జీవితం చాలా చిన్నది ఏమన్నది?
అది నిన్న మొన్న రేపు కన్నా
నేడే నిజమన్నది
నీలో జీవమున్నది
తనువును చాలించాలన్న
తలంపే చిత్తంలో చేరనీయకన్నది
నీరున్న నది ఒడ్డున
వేరున్న తరువులా చిగురించమన్నది
నీ జీవితం చాలా చిన్నది ఏమన్నది?
మనశ్శాంతి కరువైందని
మాయని గాయాలకు
"మరణాన్ని మందు" అడగకన్నది
ఆయుష్షునే ఆయుధంగా
మార్చుకోమన్నది
మృత్యువును బెదిరించడం
ఎదిరించడం నేర్చుకోమన్నది
ఈ జీవితం చాలా చిన్నది ఏమన్నది?
ఆ పరమాత్మ ఆత్మ నీలో వున్నది ఎంతో
హాయిగా సంతోషంగా ప్రశాంతంగా
నిండు నూరేళ్లు జీవించమన్నది
వెయ్యేళ్ళు చిరంజీవిగా వర్ధిల్లమన్నది



