దేశభాషలందు తెలుగులెస్సని మనం గర్వించవచ్చు
తెలుగు భాషను ప్రేమించవచ్చు అభిమానించవచ్చు
కానీ..............
పరభాషా ద్వేషం పనికిరాదు...
మన కులం వాడని మన జాతివాడని
మన వర్గం వాడని పెద్దపీట వేయవచ్చు
కానీ............
ఇతరులనెవరినీ చిన్నచూపు చూడరాదు
అసూయ పడరాదు వారిఅవకాశాలకు గండికొట్టరాదు
వారి అభివృద్ధిని అడ్డుకోరాదు వారిని అణగద్రొక్కరాదు
ఆంగ్లేయులు భారతదేశాన్ని దోచుకున్నారని
మన హిందూ సంస్కృతిని ధ్వంసంచేశారని
దూషించవచ్చు ద్వేషించవచ్చు నిందించవచ్చు
కానీ...............
ఆంగ్లభాషనుఅసహ్యించుకోరాదు అక్కసు పెంచుకోరాదు
పరబాషా పరిజ్ఞానం అవసరమేనన్న సత్యం మరువరాదు
చేయరాని నేరమేదో చేసినందుకు
దిద్దుకోలేని తప్పేదో చేసినందుకు
పరువును గంగలో కలిపేసినందుకు
చెప్పిన మాట విననందుకు చెడుమార్గంలో పోతున్నందుకు
తిట్టి కొట్టి కంటనీరు పెట్టిన అమ్మ మీద కోపం ఉండవచ్చు
కానీ............
అమ్మచేసిన వంటమీద అలకేల?ఆకలికి అలమటించ నేల?
అందమైనదని ఆస్తిపాస్తులున్నాయని
ఇష్టపడి మూడుముళ్ళు వేసి
ఎన్నో ఏళ్లుగా హాయిగా కాపురం చేయగానే
మోజు తగ్గవచ్చు ప్రేమవేడి కాసింత చల్లారవచ్చు
కానీ...............
పరస్త్రీ వ్యామోహం పనికిరాదు
అది న్యాయసమ్మతం కాదు
అది మనిషి వ్యక్తిత్వానికే మాయనిమచ్చ
ఆపై మూన్నాళ్ళ ముచ్చటే మూడుముళ్లు
ఇరువురి స్వేచ్ఛకు పడినట్లే ఇనుపసంకెళ్లు
రాగద్వేషాలకు కులమత భాషా బేధాలకుఅతీతంగా
పరమతసహనం ఫరిడవిల్లాలి ప్రతిమనిషిలో...
స్వేచ్చ స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాతృత్వం
వెల్లి విరియాలి ఈ వేదభూమిలో ఈ భారతావనిలో...



