కాస్త ఓపిక పట్టండి!
పిల్లగాలి వీస్తుంటే
చల్లని వెన్నెల కాస్తుంటే
తెల్లని మంచు కురుస్తుంటే
మసకమసక చీకటి
మత్తెక్కిస్తుంటే గుభాళించే
మల్లెపూల పరిమళాలు
గుండెల్లో గుబులు రేపుతుంటే
మంచు ముక్కలాంటి
గంధపు చెక్కలాంటి
చక్కని చుక్క ప్రక్కనవుంటే
చిలిపిచేష్టలతో, ఓరచూపులతో
చిరునవ్వులు చిందిస్తుంటే
ఒళ్ళంతా జిల్లంటుంటే....
ఆహా ఎంత తుళ్ళింత!
ఎంత హాయి ! ఎంత హాయి!
ఎంత మధురమీరేయి! అంటూ
పరవశించే ఓ ప్రేమికులారా!
చూడ చక్కనైనవాడు
వెచ్చని వెన్నెల్ని కురిపించి
ముద్దుముచ్చట తీర్చే
అందాలచంద్రుడు హఠాత్తుగా
కనిపించకుండా మారమైపోయాడని
కలవరపడకండి కలతచెందకండి
అందుకే ఓ ప్రేమికులారా!
ఆగండి కాస్త ఓపిక పట్టండి!
చుక్కల్లోచంద్రుడు ఎక్కడికెళ్ళలేదు
మీ ప్రక్కనే వున్నాడు
మబ్బులమాటున దాగివున్నాడు
కారుమబ్బులు కరిగిపోతే
తిరిగి మళ్ళీ మిమ్మల్ని
మత్తులో ముంచెత్తుతాడు
మీచే చిందులు వేయిస్తాడు
మిమ్మల్ని చిత్తుచిత్తు చేస్తాడు
అందుకే ఓ ప్రేమికులారా!
ఆగండి కాస్త ఓపిక పట్టండి!
పగలు రేయి
కౌగిలిలో కరిగిపోయే
కోర్కెలతో రగిలి పోయే
కొత్త జంటలచే
జన్మ జన్మలకు మనమే
జతగా వుందా మంటూ
ప్రమాణం చేయిస్తాడు
ఆ అందాల చందమామ...
అందుకే ఓ ప్రేమికులారా!
ఆగండి కాస్త ఓపిక పట్టండి!



