ఓ ప్రియమిత్రమా..!
నా బహుజన నేస్తమా..!!
ఎంతకాలమిలా నీవిలా
అజ్ఞానంలో అంధకారంలో
అమాయకత్వంలో దగ్దమైపోతావ్.....
ఇకనైనా
ఈ కంప్యూటర్
యుగంలోనైనా
ఊపిరాడని నీ బలహీనతల
ఊబినుండి బయట పడాలనుకో...
నీ తరతరాల బానిసత్వపు
ఉక్కుసంకెళ్ళను త్రెంచాలనుకో...
శిలను శిల్పాంగా చెక్కాలనుకో...
ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలనుకో ...
నీ కులదైవానికి మ్రొక్కాలనుకో...
"పక్షిలా" నిన్ను
పైకి ఎగరనీయకుండా...
"పచ్చని మొక్కలా" నిన్ను
పైకి ఎదగనీయకుండా...
అడుగడుగునా అడ్డుపడి నిన్ను
అణగద్రొక్కే...కులపిశాచులకు
మనువాదులకు...మతోన్మాదులకు
నీవు సింహస్వప్నమవ్వాలనుకో...ఆ
చీడపురుగుల్ని చీల్చిచెండాడాలనుకో...
ఆకులు మేసే
అమాయకపు మేకవైపోకు...
గజరాజులా ఘీంకరించాలనుకో...
గర్జించే సింహంలా బ్రతకాలనుకో...
ఆరక రగిలే
అగ్నిజ్వాలలా దహించాలనుకో...
కామందుల కాలిక్రింది
చెప్పులా మిగలాలనుకోకు...
కాల్చే నిప్పురవ్వలా రగలాలనుకో...
వారి మెడమీద వ్రేలాడే పదునైన కత్తిలా
వారికి ప్రక్కలో బల్లెంలా బ్రతకాలనుకో...
ఓ ప్రియమిత్రమా..!
నా బహుజన నేస్తమా..!!
కాకిలా కలకాలం నీవు
బ్రతికినా కడకు నీకు దొరికేది
కాటిలో పెట్టిన..."పిండమే"...
అందుకే హంసలా
కొద్దికాలం బ్రతికినా
భారత రాజ్యాంగ నిర్మాత
అమరజీవి డాక్టర్ బిఆర్
అంబేద్కర్ అందించిన
నీ ఓటు హక్కనువజ్రాయుధంతో
పోరాడి పోరాడి సాధించుకోవచ్చు
నీ హక్కుల..."అమృత భాండమే"...



