కొందరు...
జోగినీవారసులు...
సమతా వాదులు...
సనాతన విరోధులు...
పురుష ఆధిక్యంతో
అణగద్రొక్కబడి
గృహహింసకు గురై
"గృహనిర్బంధంలో "
పంజరంలో పక్షుల్లా చిక్కుకొని
"నలిగిపోయిన నారీమణులు"...
తరతరాలుగా
"కులవివక్షకు"గురై
బ్రాహ్మణ ఆధిపత్యంతో
"చతుర్వర్ణ వ్యవస్థకు" బలై
"అంటరానితనం" మంటల్లో పడి
మలమలమాడి మసైపోయిన
గుడికి...బడికి...సంపదకు..
సభ్యసమాజానికి దూరంగా
"ఎంగిలాకుల్లా" విసిరి వేయబడిన
"నిరుపేద నిమ్నజాతీయులు"...
నాడు సనాతనమే ప్రోత్సహించిన
"సతీసహగమనం" దురాచారానికి బలై
స్మశానంలో భర్తల చితిమంటల్లో దూకి
దగ్ధమైపోయిన అమాయకపు అబలలు...
"సనాతనం" ఒక విషసర్పమన్నారు"
అది "మనుధర్మానికి మారుపేరన్నారు"...
సనాతనం శాశ్వతంగా "కనుమరుగై పోవాలని
కలలు కంటున్నారు"...
"కత్తులు" దూస్తున్నారు...
"కదనానికి" సిద్ధంగా ఉన్నారు...
కానీ...
మహా మేధావులు...
బ్రాహ్మణ పూజారులు...
పీఠాధిపతులు...దేశభక్తులు...
వేదాలు పురాణాలు ఉపనిషత్తులు
సకల సనాతన బృహత్ గ్రంధాలను
ఔపాసన పట్టిన పండిత ప్రకాండులు...
సనాతనం సద్బ్రాహ్మణ సృష్టి కాదని...
అది "హిందూధర్మంలో ఒక భాగమని"...
"భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబమని"...
భారతీయ ఔన్నత్యాన్ని చాటే "సంస్కృతి
సాంప్రదాయాలకు అది మూలస్తంభమని"...
అది "ఒక కల్పతరువని"...వాదిస్తున్నారు...
అభ్యుదయవాదులతో...విభేదిస్తున్నారు...
ఔను ఓ సనాతనమా...?
కాసింత సమాధానం చెప్పుమా..!
ఏది సత్యం...? ఏది అసత్యం..?
ఏది అమృతం...? ఏది విషం...?
ఏది బెల్లం..? ఏది ప్రక్కలో బల్లెం..?
దేనికి పునాది...? దేనికి సమాధి...?



