Facebook Twitter
అస్తమించని సూర్యుడు అంబేద్కర్..!

కులం దహించే
ఒక "కారుచిచ్చని"...
విషం చిమ్మే ఒక "కుల సర్పమని"...
తన జాతిని జాగృతం చేసినవాడు...
తనకు తనజాతికి...బడిని...గుడిని
త్రాగే "మంచినీటిని" దూరం చేసిన
వర్ణవ్యవస్థ మీద..."విప్లవ శంఖాన్ని"
పూరించిన సాహసి...విప్లవ వీరుడు...
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...

స్వాతంత్ర్యం కోసం...తెల్లదొరలతో
నాడు అల్లూరి సీతారామరాజులా...
బహుజనుల స్వేచ్ఛ...స్వాతంత్ర్యం... సంఘంలో సమానత్వం...సౌభ్రాతృత్వం ప్రాధమిక హక్కులకోసం...నల్లదొరలతో...
ఒంటరిగా ఒక ప్రజాయుద్ధనౌకై...పోరాడి
రాజ్యాధికారంకోసం కమ్మనికలలు కంటూ కన్నుమూసి కడకు కాటికెళ్ళేవరకు
చాటుమాటుగా కాటువేసే "కులవివక్ష
విషసర్పాల కోరలు విరిచినవాడు...
పూర్తిగా కుటుంబాన్ని మరచినవాడు...
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్

జనం మరచినా...చరిత్ర మరువని...
ప్రపంచ మేధావి...నడిచే లైబ్రెరీ...
ప్రపంచ చరిత్రలోని ప్రతిపుటలో
సువర్ణాక్షరాలతో లిఖించబడి...
విశ్వమంతా ప్రతిధ్వనించే ఒకే ఒక్క పేరు...
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్

ఓ "చైనాగోడలా" రాజ్యాంగ
రక్షణ కవచాన్ని...నిర్మించి 
"బహుజన రాజ్యం" కోసం
తపించి...తపించి అసమానతలు లేని
బుద్ధుని సిద్దాంతాలకు ఆకర్షితుడై...
త్రికరణ శుద్ధిగా నమ్మి ఆరాదించి...
"అభినవ బుద్ధుడిగా" అవతరించి...
అశువులు బాసిన...అస్తమించని
బ్రిటిష్ సామ్రాజ్యాంలా...
"అస్తమించని సూర్యుడు"
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...
జై భీం...జైభీం...జయహో అంబేద్కరా!