సమసమాజం కోసం...
నిస్వార్థంగా తమ
నిండు జీవితాలను
తృణప్రాయంగా త్యాగం చేసిన
ఎందరో ఘనులు...త్యాగధనులు
ఎందరో మహాత్ములు మహానీయులు
అందరికీ వందనాలు పాదాభివందనాలు
పైకి కులం కులం...అంటూ...
కావు...కావుమని... అరిచి...అరిచి
అంతర్ముఖంగా అందరికీ సమానమైన అవకాశాలు...రావు రావు...లేవు లేవు
అంటూ...సమానత్వాన్ని సమాధిచేసిన
కాకులగుంపులో "ఒక రాజహంస"లా
సమసమాజం కోసం సర్వం ధారబోసిన
తన రక్తాన్ని స్వేదంలా చిందించినవాడు...
తన జీవితాన్ని తాకట్టుపెట్టినవాడు ...
తన కన్నబిడ్డలను పోగొట్టుకున్నవాడు...
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...
కులం వేటకు గురైనవాడు...
కులం కాటుకు బలైనవాడు...
క్రీస్తు శిలువను మోసిన రీతిగా
"కులం కొండను" మోసినవాడు... "కులనిర్మూలన"..."శూద్రులు ఎవరు"
బృహత్ గ్రంథాలను లిఖించినవాడు...
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...
కులంపేర కుంపటి రాజేసిన
మనుషుల మధ్య "ఇనుపగోడలు"
సృష్టించిన "మనుధర్మశాస్త్రాన్ని"
మంటల్లో వేసి బహిరంగంగా
కాల్చి "బూడిద" చేసినవాడు...
మనువాదుల్ని...మతోన్మాదుల్ని
"ప్రజాబలిపీఠం" పై ఉరిదీసినవాడు...
అమరజీవి...డాక్టర్ బిఆర్ అంబేద్కర్...



