Facebook Twitter
బలహీనులు కాదు బాహుబలులు..!

ఒకనాడు వారు
అగ్రవర్ణాల "వంచనకు"
మనువాదపు "మంటలకు"
బానిసత్వానికి బలైనవారు...
తరతరాలుగా అంటరానివారుగా
ఊరికి బహుదూరంగా ఉంచబడినవారు
అణచబడినవారు అణగద్రొక్కబడినవారు

ఐనా ఆ బహుజనులు
వినయ విధేయతలకు...
ప్రతిబింబాలు...
సకలజనుల హితం కోరే
విశాల హృదయమున్నవారు...
రెక్కలు ముక్కలుచేసే శ్రమజీవులు...

వారు
అక్రమాలను
అన్యాయాలను
ఎదురించే...వీరులు...
తల ఎత్తుకు తిరిగే...శూరులు...
నమ్మినవారికి వారు రక్షణ కవచాలు...

కానీ నయవంచకులకు...
కులం పేర దూషించే వారికి...
కులం కుంపట్లు రాజేసేవారికి...
కుట్రలు కుతంత్రాలు పన్నే వారికి...
కులం పేరుతో అవమాన పరిచేవారికి...

ముందు నవ్వుతూ వెనుక లోతుగా
గోతులు త్రవ్వే అనుకూల శత్రువులకు...
ప్రక్కలో బల్లేలు...గుండెల్లో గునపాలు
తలలు తెగనరికే...గండ్రగొడ్డళ్ళు
పూరి గుడిసెల్లో...పుట్టిన ఆ పులిబిడ్డలు

వారివి...ప్రశ్నించే గొంతులు
అసమానతల్ని పిడికిలి బిగించి...
ప్రతిఘటించే...విప్లవ వీరులు వారు
వారు బలహీనులు కాదు బాహుబలులు
వారందరూ కోరేది ఒక్కటే రాజ్యాధికారం