మీరు మహనీయుల మహాత్ముల
పుణ్యపురుషుల దైవాంశసంభూతుల
జీవిత చరిత్రలను ఏకాగ్రతతో పఠిస్తే
వీధిలోని వారి విగ్రహాలను దర్శిస్తే
వారి వర్ణచిత్రాలను నిత్యం వీక్షిస్తే
వారి ఆత్మలు మిమ్ము ఆవహించవచ్చు
మీలో పెనుమార్పులు జరగవచ్చు
అప్పుడు మీరు సైతం.....
"జీసస్ క్రైస్ట్ లా" ప్రేమిస్తారు
నిన్ను వలే నీ పొరుగువారిని
ప్రేమించమంటారు
ప్రేమే జీవితమంటారు
ప్రేమను పదిమందికి పంచుతారు
అప్పుడు మీరు సైతం.....
"గౌతమ్ బుద్ధలా" త్యజిస్తారు
మీకు ఇతరులపై ఉన్న కోపతాపాల్ని
మనసులోని అసూయాద్వేషభావాల్ని
ఎదలో రగిలే పగా ప్రతీకారాల్ని
అప్పుడు మీరు సైతం.....
స్వామి వివేకనందలా ఆలోచిస్తారు
సభ్య సమాజాన్ని గురించి
భారతీయతను గురించి
హిందూ ధర్మాన్ని గురించి
సంస్కృతి సంప్రదాయాలను గురించి
విశ్వశాంతి గురించి
అప్పుడు మీరు సైతం.....
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లా
ప్రజలపక్షాన పోరాడుతారు
జీవితాన్ని త్యాగం చేస్తారు
నిరుపేదల తలరాతల
రాజ్యాంగాన్ని వ్రాస్తారు
వారి చీకటి జీవితాలను
వెలుగుమయం చేస్తారు
అప్పుడు మీరు సైతం.....
మహాత్మా గాంధీలా
పట్టువదలని విక్రమార్కుడిలా
అహింసనే ఆయుధంగా
చేసుకుని అనుకున్న లక్ష్యాలను
అవలీలగా సాధిస్తారు
అప్పుడు మీరు సైతం.....
శ్రీ రామకృష్ణ పరమహంసలా
హాయిగా ఆనందంగా
పరమానందంగా
ప్రశాంతంగా జీవిస్తారు
మరో అభినవ వివేకానందున్ని
ప్రపంచానికి అందిస్తారు



